ముద్ర ప్రతినిధి , కోదాడ ….
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కల్తీ వంట నూనెల వ్యవహారం కలకలం రేపుతోంది. పట్టణంలోని ఒక ఆయిల్ షాపులో కల్తీ నూనె విక్రయిస్తున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు ప్రాంతం నుండి ట్యాంకర్ల ద్వారా కోదాడతో పాటు సూర్యాపేట , హైదరాబాద్‌కు కూడా కల్తీ నూనె తరలిస్తున్నట్లు తెలుస్తుంది . ఈ నూనెను స్థానికంగా ఖాళీ క్యాన్‌లలో నింపి సీల్ వేసి ప్రముఖ బ్రాండ్ల పేర్లతో మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇంకా ఈ కల్తీ నూనెను పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నట్లు అనుమానం . అర్ధరాత్రి సమయంలో హైవే పక్కన ట్యాంకర్ నుండి ఆటోలో ఉన్న ఖాళీ క్యాన్‌లలో నూనె నింపుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
గుట్టుచప్పుడు కాకుండా గత కొన్నేళ్లుగా ఈ కల్తీ నూనెల వ్యాపారం కొనసాగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి లూస్ ఆయిల్ వాడకూడదని ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ కల్తీ ఆయిల్ నూ ఇలా ఖాళీ క్యాన్ లలో నింపి సీల్ వేసి పలు హోటళ్లు , రెస్టారెంట్లకు తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది . ఈ నాసిరకం నూనె వాడటం వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ వ్యవహారంపై ఆహార భద్రతా అధికారులు, సంబంధిత శాఖలు దృష్టి సారించి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.