- ఒక ఏడాదిలోనే ఈ నిధులు తీసుకొస్తా.
- అభివృద్ధి కోసం ఎవరితోనైనా కొట్లాడుతా.
- రాజకీయాలకు కాదు అభివృద్ధికే ప్రాధాన్యతనిస్తా.
- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
ముద్ర ప్రతినిధి,మహబూబ్నగర్: ఒక ఏడాదిలోపుగా జడ్చర్ల పట్టణ సమగ్రాభివృద్ధి కోసం రూ.100 కోట్ల నిధులను తీసుకొస్తామని, పార్టీలకు అతీతంగా అన్ని మున్సిపల్ వార్డులను అభివృద్ధి చేస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు.రాజకీయాలు చేయడం కంటే ఎక్కువగా తాను సమస్యల పరిష్కారానికి, సమగ్రాభివృద్ధికే ప్రాధాన్యత నిస్తానని టియుఎఫ్ఐడిసి నిధులతో ప్రస్తుతం చేపడుతున్న పనుల్లో ఎక్కువ నిధులను బీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డుకే కేటాయించడం దీనికి నిదర్శనమని వివరించారు.తెలంగాణ పట్టణ ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టియుఎఫ్ఐడిసి) నిధులతో జడ్చర్ల మున్సిపాలిటీలోని 27 వార్డులలో రూ.7.44 కోట్ల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు అనిరుధ్ రెడ్డి బుధవారం శంకుస్థాపనలు చేసారు. ఈ సందర్భంగానే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం రూ.7.44 కోట్ల నిదులతో జడ్చర్ల పట్టనంలో 5.70 కి.మీ.ల సీసీ రోడ్లు, 3.50 కి.మీ.ల సీసీ డ్రైన్లు నిర్మించనున్నారని, ఈ పనులు వెంటనే ప్రారంభమౌతాయని చెప్పారు. అలాగే పట్టణంలోని రోడ్లలో వర్షపు నీళ్లు నిలిచిపోకుండా రూ.14 కోట్లతో స్ట్రామ్ వాటర్ డ్రైన్ల నిర్మాణాలను మంజూరు చేయించామని, దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ మరో 15 రోజుల్లో పూర్తవుతుందని, ఆ తర్వాత వీటి నిర్మాణాలకు కూడా తాను శంకుస్థాపన చేస్తానని తెలిపారు.పనులు నిధులు మంజూరు కాకుండానే శంకుస్థాపనలు చేయనని, నిధులు మంజూరైన పనులకు మాత్రమే శంకుస్థాపనలు చేస్తానని స్పష్టం చేసారు.ప్రస్తుతం టియుఎఫ్ఐడిసి నిధులతో చేపట్టిన పనుల్లో ఎక్కువగా కాంగ్రెస్ వార్డులకే ప్రాధాన్యత ఇచ్చారని, తమ వార్డులను పట్టించుకోలేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు బాధపడుతున్నారని తనతో మున్సిపల్ ఛైర్ పర్సన్ చెప్పారని ప్రస్తావించారు. అయితే అలాంటిదేమీ లేదని, సమస్యలను పరిష్కరించడానికి తాను ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.ప్రస్తుతం రూ.7.44 కోట్లతో చేపడుతున్న పనులకు సంబంధించిన నిధుల్లో అన్ని వార్డుల కంటే అత్యధికంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రాతినిథ్యం వహిస్తున్న 3 వ వార్డుకు రూ.1.14 కోట్లు కేటాయించామని అనిరుధ్ రెడ్డి చెప్పారు.ఒక వార్డుకు కేవలం ఐదు, పది లక్షల రుపాయలు ఇచ్చినంతమాత్రాన ఆయా వార్డులు పూర్తిగా అభివృద్ధి చెందవని, ఒక్కో వార్డు అభివృద్ధి కోసం కనీసం కోటి రుపాయలు కావాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మున్సిపాల్టీకి వచ్చిన టియుఎఫ్ఐడిసి నిధులు కాకుండా అదనంగా రూ.70 కోట్లు జడ్చర్ల మున్సిపాలిటీకి ఇవ్వాలని తాను ప్రభుత్వాన్ని కోరానని, ఈ విషయంగా ఆర్థిక శాఖామంత్రి భట్టి విక్రమార్కతో కూడా మాట్లాడానని ఈ ఏడాదిలో రూ.70 కోట్లు మున్సిపాలిటీకి వస్తాయని వెల్లడించారు.ఇది కాకుండా ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు సంబంధించి రూ.5 కోట్లు వచ్చాయని, ఎల్ఆర్ఎస్ లో ఇంకా 17 వేల దరఖాస్తులు పరిశీలనలో ఉండగా వాటికి సంబంధించిన నిధులకు కూడా మున్సిపాలిటీకి వస్తాయని చెప్పారు.2వ వార్డు పరిధిలోని కావేరమ్మపేటలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద డ్రైనేజీ సమస్యను తీర్చడానికి ముడా నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఏడాది తాను కొట్లాడి ముడా నుంచి కూడా జడ్చర్లకు రూ.10 కోట్ల నిధులను తీసుకొచ్చానని తెలిపారు.వీటిలో కూడా రూ.2 కోట్లు జడ్చర్ల మున్సిపాలిటీకి కేటాయించామని తెలిపారు.మిగిలిన నిధులను గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చామన్నారు. అయితే గతంలో ఎమ్మెల్యేగా ఉన్న లక్ష్మారెడ్డి జడ్చర్లకు ముడా నుంచి రూ.30 కోట్లు రావాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు ఆ నిధులన్నింటినీ మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి వాడుకోవచ్చునంటూ సంతకం చేసి జడ్చర్లకు అన్యాయం చేసారని అనిరుధ్ రెడ్డి పునరుద్ఘాటించారు.మొత్తం మీద తాను జడ్చర్ల పట్టణాభివృద్ధి కోసం రాబోయే ఏడాది కాలంలో రూ.100 కోట్ల నిధులను తీసుకొస్తామని ప్రకటించారు.ఈ నిధులను పార్టీలకు అతీతంగా అన్ని వార్డుల అభివృద్ధికి కేటాయిస్తామన్నారు.ఒక ఏడాది లోపుగా ఈ నిధులను తీసుకొచ్చి జడ్చర్లలో అభివృద్ధి పనులను చేపడుతామన్నారు. టియుఎఫ్ఐడిసి నిధులతో చేపట్టిన పనుల్లో ప్రస్తుతం పనులు పెద్దగా కేటాయించని అన్ని వార్డులకు కూడా నిధులను కేటాయించి, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా చూస్తామని హామీ ఇచ్చారు.జడ్చర్ల నియోజకవర్గం అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు.రాజకీయాలు చేయడం తన అభిమతంకాదని, తప్పును తప్పంటానని, అభివృద్ధి కోసం ఎవరితోనైనా కొట్లాడుతానని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేసారు.కాగా ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని నాగర్ కర్నూల్ రోడ్, శ్రీరామ్ నగర్, పాతబజారు, కల్వకుర్తి రోడ్డు, ఇందిరానగర్ కాలనీ, కావేరమ్మ పేట, నేషనల్ హైవే, విజయనగర్ కాలనీల్లో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను అనిరుధ్ రెడ్డి ఆవిష్కరించారు. జడ్చర్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసారు.