Take a fresh look at your lifestyle.

పుర పోరులో 80శాతం ప్రజలు ప్రజాపాలనను ఆమోదించారు -ఢిల్లీలో మీడియాతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

వచ్చే నెల 15లోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ
పార్టీ కోసం పని చేసే వారికే ప్రాధాన్యం
వచ్చే రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే విజయం
న్యూఢిల్లీ :

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులన్నింటినీ వచ్చే నెల 15 లోపు భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. పార్టీ రాష్ట్రంలో అధికారంలో వచ్చేందుకు, అహర్నిషలు పార్టీ కోసం కష్టపడ పని చేసే నాయకులకు ఆయా పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బలపడిన కాంగ్రెస్.. మున్ముందు ఎదురులేని శక్తిగా నిలవబోతోందని జోస్యం చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌కు తిరుగులేదన్న ఆయన వచ్చే రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించి తిరిగి అధికారాన్ని కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రివర్గంతో ఢిల్లీ పర్యటనలో ఉన్న మహేశ్ కుమార్ గౌడ్ గురువారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. అనంతరం అక్కడి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మంత్రులు అంద‌రితో కాంగ్రెస్ అగ్రనాయ‌కులు స‌మావేశం అయినట్లు వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు.. రేవంత్ రెడ్డి సర్కార్ అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల గురించి ఈ సమావేశంలో చర్చించిన‌ట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌.. పంచాయతీలు, మున్సిపల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందించారని మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని తెలంగాణ ప్రజలు ఆస్వాదిస్తున్నారు కాబట్టి.. మున్సిపల్ ఎన్నికల్లో తమను ఆశీర్వదించార‌ని చెప్పారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజ‌లు కాంగ్రెస్ పార్టీకి మ‌ద్దతు ఇచ్చారన్నారు. తెలంగాణలో నడుస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధి విధానాల గురించి రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.