Take a fresh look at your lifestyle.

మాదకద్రవ్యాల నియంత్రణ అవగాహన ర్యాలీతో పాటు గిరిజన రైతులకు భూ పట్టాల పంపిణీ – కలెక్టర్ రాజర్షి షా కార్యక్రమాలు

  బోథ్, ముద్ర:

మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో ఔషధ నియంత్రణ, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ వినియోగంపై స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి రిమ్స్ ఆడిటోరియం వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో డ్రగ్స్ నియంత్రణ అత్యంత ముఖ్యమైన అంశమని ముఖ్యంగా ‘అల్ప్రాజోలం వంటి ప్రమాదకరమైన హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ విషయంలో కెమిస్ట్‌లు, ఫార్మసిస్ట్‌లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇటువంటి మందులను విక్రయించడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నపాటి జలుబు, దగ్గుకు నేరుగా యాంటీబయాటిక్స్ వాడకూడదని, షెడ్యూల్ హెచ్, హెచ్1 మందులను డాక్టర్ల సలహా మేరకే తీసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ఏ మందులు పని చేయని పరిస్థితి వస్తుందని వివరించారు. రిమ్స్, మెడికల్ కళాశాల ప్రాంగణాల్లో సింథటిక్ డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగంపై నిఘా ఉంచాలని హెచ్‌ఓడీలను ఆదేశించారు. మత్తుకు బానిసైన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు డీ-అడిక్షన్ సెంటర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. అత్యధిక మోతాదులో మందులు వాడటం వల్ల కిడ్నీలు, లివర్ వంటి అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, దీనిపై గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని కోరారు. మందుల దుకాణాల్లో క్యూఆర్ కోడ్ విధానం ద్వారా మందుల దుష్ప్రభావాలను తెలుసుకునేలా వినియోగదారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, డీఎంహెచ్‌ఓ నరేందర్ రాథోడ్, డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత, ఎస్ఐ సందీప్, మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు.

గిరిజన రైతులకు భూ పట్టాల పంపిణీ

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్సి- బి తండాకు చెందిన గిరిజన రైతులకు సంబంధించి 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా చొరవతో సమస్యను వేగంగా పరిష్కరించి, రైతులకు భూ పట్టాలను అందజేశారు. ఫారెస్ట్, రెవెన్యూ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు, సర్వే నంబర్లలో ఉన్న సాంకేతిక సమస్యల కారణంగా పల్సి-బి తండాకు చెందిన సుమారు 9 మంది ఎస్టీ రైతులు దశాబ్దకాలంగా పట్టాలు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో కూడా వారు వెనుకబడ్డారు. రైతులు తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకురాగానే, ఆయన వెంటనే స్పందించి సీసీఎల్ఏ అధికారులతో సమన్వయం చేసి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్ పర్యవేక్షణలో రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టి సమస్యను కొలిక్కి తెచ్చింది. ఈ పరిష్కారంలో భాగంగా మొత్తం 30 ఎకరాల భూమిని అర్హులైన రైతులకు కేటాయించారు. 9 మంది రైతులకు వారి సాగు విస్తీర్ణం ఆధారంగా 2 నుండి 3 ఎకరాల వరకు పట్టాలు కలెక్టర్ స్వయంగా అందజేశారు. పట్టాలు అందుకున్న రైతులు శనివారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆనందం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. తమ దీర్ఘకాల సమస్యను పరిష్కరించినందుకు ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంఆర్ఓ రాజ్‌మోహన్, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.