- అఫడవిట్స్ కాపీ పేస్ట్ చేస్తే తెలియదనుకున్నారా..?
- నిర్మాణ సంస్థలపై కాళేశ్వరం కమిషన్ సీరియస్
- నలుగురి అఫడవిట్లను పరిశీలించిన పీసీ ఘోష్
- అన్నీ ఒకేలా ఉన్నాయని మండిపాటు
- సుందిళ్ల నిర్మాణం చేసిన నవయుగ
- మూడు సంస్థలు కాఫీ పేస్ట్ చేశాయంటూ ఫైర్
- బ్యారేజీ డ్యామేజ్‌పై నవయుగ ప్రతినిధి డైరెక్టర్ రమేశ్‌ను ప్రశ్నించిన కమిషన్
- పనులు చేసినా బిల్లులు రాలేదంటూ కమిషన్ ముందు గగ్గోలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : విచారణ కమిషన్ నే పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారా..? మాకు కనీసం అవగాహన లేకుండానే విచారణ చేస్తున్నామని అనుకుంటున్నారా..? మొదట్నుంచి విచారణలో అందరూ ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారు. విచారణకు సహకరించాలని లేకపోతే స్పష్టంగా చెప్పేయండి..తర్వాత చర్యలకు సిద్ధంగా ఉండండి.. అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్..సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం చేపట్టిన నవయుగ సంస్థ ప్రతినిధులపై ఫైర్ అయింది,ఆ సంస్థకు చెందిన నలుగురు ప్రతినిధులుగురువారం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
గతంలో ఆ సంస్థ ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగా క్రాస్ ఎగ్జామింగ్ చేస్తున్న కమిషన్ నవయుగ సంస్థపై అసహనం వ్యక్తం చేసింది.ఆ అఫిడవిట్ ను నవయుగ డైరెక్టర్ రమేశ్,మరో ముగ్గురు ప్రతినిధులు కాపీ పేస్ట్ చేసినట్లు కమిషన్ గుర్తించింది.అందరి అఫిడవిట్లు ఒకేలా ఉన్నాయని వారి తీరుపై అసహనం వ్యక్తం చేసింది. కాగా విచారణలో భాగంగా సుందిళ్ల బ్యారేజీ డ్యామేజీ ఎలా?ఎప్పుడు జరిగిందని ? డ్యామేజీ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని కమిషన్ ప్రశ్నించింది. 2022లో వచ్చిన వరదలతోనే జరిగినట్టు నవయుగ డైరెక్టర్ రమేశ్ సమాధానం ఇచ్చారు. సీసీ బ్లాక్స్ కింద సీపేజీ ఏర్పడి బ్లాకులు కొట్టుకు పోయాయని చెప్పారు. దాని వల్లే వరద ప్రవాహం ఎక్కువగా రికార్డయ్యిందని అన్నారు.డ్యామేజ్ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించింది.
గ్రౌంటింగ్ చేశామని, సీసీ బ్లాకులను పునరుద్ధరించామని రమేశ్ సమాధానం ఇచ్చారు. డిజైన్ ఆధారంగా.. డ్యామేజీ జరిగిన తర్వాత మరమ్మతులు చేశామని వెల్లడించారు. 2016లో అగ్రిమెంట్ జరిగిందని, సప్లిమెంటరీ అగ్రిమెంట్లు జరగలేదని నవయుగ కంపెనీ ప్రతినిధులు కమిషన్‌కు తెలిపారు.కాగా పనులు పూర్తి చేసినా బిల్లులు ఇంకా ఇవ్వలేదని కంపెనీ ప్రతినిధులు వాపోయారు. పనులు పూర్తయినట్టు ప్రభుత్వానికి సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ డ్యామేజ్ జరగడంతో బిల్లులు ఆపారని రమేశ్ కమిషన్‌కు తెలిపారు.