Take a fresh look at your lifestyle.

16 సంస్థలు.. రూ.1,78,950 కోట్లు …. దావోస్ లో తెలంగాణ ధమాక

  • రాష్ట్రానికి పెట్టుబడుల వరద
  • కొత్త ఒప్పందాలతో 49, 500 ఉద్యోగాలు
  • రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇదే అతి పెద్ద రికార్డు
  • 16 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వం
  • గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లకు మించి పెట్టుబడులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : దావోస్​ పర్యటనలో ఉన్న తెలంగాణ రైజింగ్​ బృందం సంచలనం సృష్టించింది. పెట్టుబడుల సమీకరణలో కొత్త రికార్డులు నెలకొల్పింది. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడులు తీసుకొచ్చి రికార్డు నమోదు చేసింది. అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణమున్న హైదరాబాద్ గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్యస్థానంగా మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ఇప్పటి వరకు రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు సాధించింది. దేశ విదేశాలకు చెందిన పేరొందిన 19 ప్రముఖ, దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న ఈ బృందం ఐటీ,ఏఐ,ఇంధన రంగాల్లో అంచనాలకు మించి భారీ పెట్టుబడులు సాధించింది.

వరుసగా మూడు రోజుల పాటు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల పెట్టుబడుల్లో భాగంగా రాష్ట్రంలో 49,550 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ టీం దావోస్ వేదికపై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ బృందం వివిధ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ విజయవంతమయ్యాయి. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి మూడింతలకు మించిన పెట్టుబడులు రావటం విశేషం. హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వటం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంది. దాంతో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళికలు పెట్టుబడుల వెల్లువకు దోహదపడ్డాయి.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తలను దృష్టిని ఆకర్షించింది.

అమెజాన్ రూ. 60వేల కోట్ల పెట్టుబడులు :

హైదరాబాద్ లొ రూ.60వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో భేటీ అయ్యారు. భవిష్యత్తులో అర్టిఫిషియల్ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకంగా మారనున్నాయి. తెలంగాణలో తన క్లౌడ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి 2030 నాటికి 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే ప్రకటించింది. ఒక బిలియన్ పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు సెంటర్లను గతంలోనే అభివృద్ధి చేసింది. ఈ మూడు కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి.కొత్తగా చేపట్టే విస్తరణ ప్రణాళికలకు అవసరమైన భూమిని కేటాయించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది.

సంగారెడ్డిలో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి కేంద్రం

తెలంగాణలో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి ఎక్సలెన్స్ సెంటర్‌ ఏర్పాటుకు సుహానా మసాలా, ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్‌ సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా సుగంధ ద్రవ్యాల సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ సంస్థ.. సంగారెడ్డిలో ప్రస్తుతం ఉన్న సుహానా ప్లాంట్ పక్కనే కొత్తగా ఎక్సెలెన్స్ సెంటర్​ ను నెలకొల్పుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబుతో సమావేశమైన సుహానా డైరెక్టర్ ఆనంద్ చోర్డియా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో వచ్చే మూడేండ్లలో ఈ సెంటర్ ద్వారా 30వేల మంది రైతులకు శిక్షణతో పాటు సుగంధ ద్రవ్యాల నాణ్యత, వ్యవసాయ పద్ధతులను అధునికరించే నైపుణ్యాలు అందిస్తామని చెప్పారు. మరోవైపు సుగంధ ద్రవ్యాల ఉత్పత్తికి అంతర్జాతీయ ప్రమాణాలు పాటించటంతో పాటు రైతుల జీవనోపాధి పెంచేలా మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ సెంటర్ పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తామన్న ఆనంద్​ చోర్డియా ఇది సహజ వనరుల సంరక్షణకు సహాయపడుతుందన్నారు. సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.

హైదరాబాద్‌లో ఎక్లాట్ హెల్త్ కొత్త ఆఫీస్​

ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలో పేరొందిన ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ రాష్ట్రంలో మరో కార్యాలయం ఏర్పాటుకు ముందుకువచ్చింది. దాదాపు 800 మంది ఉద్యోగులకు సదుపాయముండేలా దీన్ని నెలకొల్పుతున్నట్లు ప్రకటించింది. ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తో భేటీ అయిన ఆ కంపెనీ సీఈవో కార్తీక్ పోల్సాని ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి రాష్ట్రంలో కార్యకలాపాల విస్తరణకు అంగీకరించారు. ఈ క్రమంలో ఎక్లాట్.. హైదరాబాద్‌లో అత్యాధునిక 800-సీట్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుంది. హెల్త్ కేర్ రంగంలో అమెరికాలోనే అతి పెద్ద యునైటెడ్ వ్యవస్థ ఉన్న కంపెనీ తమ వినియోగదారులకు మరింత సమర్థవంతమైన సేవలను అందించేందుకు అదనంగా ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. రెవెన్యూ, డేటా అనలిటిక్స్, ఏఐ ఆధారిత క్లినికల్ డాక్యుమెంటేషన్ సొల్యూషన్స్ లో ఈ కంపెనీ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. వాషింగ్టన్,డి.సి.లో ప్రధాన కార్యాలయమున్న ఎక్లాట్ హెల్త్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 3వేల మందికి పైగా నిపుణులను నియమించింది. అమెరికాలోనే 450 మంది ఉద్యోగులున్నారు. హైదరాబాద్‌లోని ఇప్పటికే ఉన్న రెండు ఆఫీసుల్లో 2,000 మందికి పైగా ఉద్యోగులున్నారు. 2011లో ద్వితీయ శ్రేణి నగరమైన కరీంనగర్ లో ఈ కంపెనీ పైలెట్ కార్యకలాపాలు ప్రారంభించింది. అక్కడ దాదాపు 500 మంది పని చేస్తున్నారు. ఎక్లాట్ విస్తరణతో తెలంగాణలో కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నైపుణ్య అభివృద్ధి కి దోహదపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రోత్సహకరంగా ఉన్నాయని ఎక్లాట్ హెల్త్ గ్రూప్ సీఈవో కార్తీక్ పోల్సాని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తమ క్లయింట్‌లకు హెల్త్ కేర్ సేవలను అందించేందుకు రాష్ట్రంలో అన్ని అనుకూలతలు ఉన్నాయని చెప్పారు.అత్యాధునిక సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ కంపెనీలను ఆకర్షించడంలో తెలంగాణ ముందంజలో ఉందని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు.

రూ. 7వేల కోట్లతో సోలార్ సెల్స్ తయారీ యూనిట్

అత్యాధునిక సోలార్ సెల్స్,మాడ్యూల్స్ తయారీ యూనిట్ స్థాపించేందుకు మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ అక్షత్ గ్రీన్ టెక్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం రూ. 7వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చింది. హైదరాబాద్‌లో 6.9 గిగావాట్ల సోలార్ సెల్, 6.9 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీ ఏర్పాటుతో రాష్ట్రంలో 2,500మందికి ఉద్యోగవకాశాలున్నాయి. ఈ మేరకు అక్షత్ గ్రీన్‌టెక్ (మైత్రా గ్రూప్)డైరెక్టర్ గిరీష్ గెల్లి తో రైజింగ్​ బృందం ఒప్పందం కుదుర్చుకుంది.

బ్లాక్ స్టోన్ రూ. 4,500 కోట్ల పెట్టుబడులు

పెట్టుబడులు, మౌలిక సదుపాయాలలో ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్‌స్టోన్ లుమినా..హైదరాబాద్ లో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకువచ్చింది. రూ. 4,500 కోట్ల పెట్టుబడితో 150 మెగావాట్ల డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది.బ్లాక్‌స్టోన్ లూమినాతో పాటు జేసీకే ఇన్‌ఫ్రా ప్రతినిధులు ప్రభుత్వంతో ఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇది ఇంధన సామర్థ్యం, అధునాతన శీతలీకరణ వ్యవస్థలు,సైబర్ భద్రతా ప్రోటోకాల్‌ అవసరాలకు సంబంధించి ఏఐ ఆధారిత సేవలు అందిస్తుంది.బ్లాక్‌స్టోన్ లుమినా ప్రపంచంలోని ప్రముఖ క్లౌడ్ మౌలిక సదుపాయాల ప్రొవైడర్లలో కీలకంగా ఉంది. ఈ కంపెనీ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవటంతో మిగతా విదేశీ కంపెనీలు సైతం తెలంగాణ వైపు చూస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలకు తెలంగాణ గమ్యస్థానంగా మారనుంది.

రూ. 5వేల కోట్టతో ఏఐ డేటా సెంటర్

హైదరాబాద్ లో రూ.5వేల కోట్ల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్​ ఏర్పాటుకు అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్స్ ముందుకువచ్చింది. ఆ కంపెనీ ఇక్కడ అత్యాధునిక అర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్‌ను స్థాపించనుంది.కంపెనీ సీఈవో సతీష్ అబ్బూరి,సీఆర్వో ఎరిక్ వార్నర్ ప్రభుత్వంతో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. హైదరాబాద్ లో 100 మెగావాట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని, ఇందులో హైబ్రిడ్ ఏఐ చిప్‌లను ఉపయోగిస్తామని కంపెనీ సీఈవో పెందుర్తి చెప్పారు.

హైదరాబాద్‌లో రూ.15వేల కోట్ల డేటా సెంటర్..!

హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెంటర్ అభివృద్ధి చేసేందుకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ ముందుకొచ్చింది. రూ. 15,000 కోట్ల పెట్టుబడులతో 300 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.అమెరికాకు చెందిన ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.అర్టిఫిషియల్ ఆధారిత అప్లికేషన్‌లు,క్లౌడ్ సేవలు,డేటా ప్రాసెసింగ్ కు ఈ డేటా సెంటర్ ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా టిల్‌మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ అధ్యక్షుడు సచిత్ అహుజా మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలు, దార్శనిక నాయకత్వం తమను ఆకట్టుకుందని చెప్పారు. ఈ మొత్తం కార్యక్రమాల్లో సీఎం, మంత్రి శ్రీధర్​ బాబు వెంట పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్​ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.