Take a fresh look at your lifestyle.

పకడ్బందీగా 99 రోజుల కార్యక్రమం కలెక్టర్ ప్రతిమాసింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన… ప్రగతి ప్రణాళికలు కార్యాచరణ అమలుపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ప్రణాళిక, ఇరిగేషన్, హోం, రవాణా, వ్యవసాయం, ఉద్యానవన, విద్య, వైద్య, మహిళా శిశు సంక్షేమ, హౌసింగ్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అయిదు దశల్లో అమలు చేయనున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ క్షుణ్ణంగా వివరించారు.


ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం, సేవలను సమర్థవంతంగా అందించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈనెల 6 నుండి జూన్ 12 వరకు వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు.
ఈనెల 6 నుండి మార్చి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాలలో ఫైళ్ల పరిష్కరణ అంశంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యాలయాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల వేగవంతమైన పరిష్కారం, రికార్డుల సక్రమ నిర్వహణ, ప్రజలకు సమయానుకూల సేవలందించడం లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గ్రామాలు, మున్సిపాలిటీలలో తడి–పొడి చెత్త వేరు సేకరణ, పిచ్చి మొక్కల తొలగింపు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త నిర్మూలన, ప్రభుత్వ భవనాల శుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు.
ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 11 వరకు ఆరోగ్యం – ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనకమైన భవిష్యత్తులు అంశంపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు, వైద్య పరీక్షలు, గర్భిణీలు, చిన్నారులకు ప్రత్యేక పర్యవేక్షణ, పోషకాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయని వివరించారు.
ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 18 వరకు సురక్షితంగా చేరుకోండి కార్యక్రమం హోం, రవాణా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని తెలిపారు. రోడ్డు భద్రతపై అవగాహన, ట్రాఫిక్ నియమాల కఠిన అమలు, హెల్మెట్–సీట్‌బెల్ట్ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 25 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు స్థితిపై సమీక్షలు నిర్వహించి, లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు పిల్లల భద్రత, రక్షణ – డ్రగ్స్‌కు నో కార్యక్రమం పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాల రూపంలో అమలు చేయబడుతుందని చెప్పారు.
మే 4 నుండి మే 9 వరకు రైతులు, వ్యవసాయ, రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్ శాఖలు సమన్వయంతో రైతులకు సాగు సలహాలు, ఎరువులు–విత్తనాల లభ్యత, సాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా అంశాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మే 11 నుండి మే 16 వరకు విద్య అంశంపై పాఠశాలల మౌలిక వసతులు, పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, బోధన నాణ్యతపై సమీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు.
మే 18 నుండి మే 23 వరకు యువత మరియు క్రీడలు అంశంపై క్రీడా పోటీలు, యువజనోత్సవాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు చేపట్టాలని సూచించారు.
మే 25 నుండి మే 30 వరకు మహిళలు అంశంపై మహిళా సాధికారత, స్వయం ఉపాధి, స్వయం సహాయక సంఘాల బలోపేతం, రుణాల సద్వినియోగంపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జూన్ 1 నుండి జూన్ 12 వరకు పర్యావరణం అంశంపై వృక్షారోపణ, ప్లాస్టిక్ నియంత్రణ, పచ్చదనం పెంపు కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు, అదనపు ఎస్పీ మహేందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.