Take a fresh look at your lifestyle.

ప్రజావాణిలో వృద్ధుల వద్దకు స్వయంగా వెళ్లిన కలెక్టర్

 

వృద్ధుల ఆవేదన విన్న జిల్లా కలెక్టర్

సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:

సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మానవీయ స్పందనతో వ్యవహరించారు. అదనపు కలెక్టర్ పి. అమరేందర్ తో కలిసి ప్రజావాణి సమావేశ మందిరంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా తమ పిల్లలు ఆస్తులను తీసుకుని ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజావాణికి వచ్చిన వృద్ధుల వద్దకు కలెక్టర్ స్వయంగా వెళ్లి వారి వినతిపత్రాలను స్వీకరించారు. వృద్ధుల సమస్యలను ఓర్పుగా, శ్రద్ధగా విన్న కలెక్టర్ వారికి ధైర్యం చెప్పారు. సమస్యను సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వృద్ధుల పట్ల కలెక్టర్ చూపిన ఆప్యాయత, స్పందన అక్కడున్న వారిని కదిలించింది. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చి తమ సమస్యలను వినిపిస్తూ ఫిర్యాదులు సమర్పిస్తున్నందున ప్రజావాణిపై ప్రజలకు నమ్మకం కల్పించే బాధ్యత అధికారులపై ఉందన్నారు.

తిరస్కరణకు గురైన దరఖాస్తులపై తప్పనిసరిగా స్పష్టమైన రిమార్కులు నమోదు చేయాలని, ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రజావాణి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. ప్రజావాణిలో వివిధ సమస్యలకు సంబంధించిన మొత్తం 35 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.

అందిన ప్రతి దరఖాస్తుపై ఎండార్స్‌మెంట్ చేసి సంబంధిత శాఖల అధికారులకు పంపించిన కలెక్టర్, ఎలాంటి జాప్యం లేకుండా వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఆర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగంగా పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.

పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని, రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే ప్రతి ప్రజావాణి ఫిర్యాదుకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, కలెక్టరేట్ వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.