ముద్ర. పరకాల : పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను పరకాల ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి విడుదల చేశారు. ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఆయన వార్డులలో ఎక్కడ రెబల్స్ బెడద లేకుండా చూసి అభ్యర్థులు జాబితాను ప్రకటించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు వార్డులలో పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసే అభ్యర్థులను పక్కనపెట్టి పార్టీ కోసం కష్టపడిన అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు.

మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 22 వార్డులలో పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలని ఆయన పట్టణ ప్రజలను కోరారు. 22 వార్డులలో పార్టీ బలపరిచిన వ్యక్తులు మినహా రెబల్స్ లేరని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులను గెలిపించినట్లయితే పరకాల పట్టణాన్ని పాలకవర్గ సభ్యులతో పాటు తను శక్తి వంచన లేకుండా అభివృద్ధి చేస్తానని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. పరకాల పట్టణంలోని ప్రతి వార్డులో ఇప్పటికీ పేరుకుపోయిన అన్ని రకాల సమస్యలు పరిష్కారం కోసం తాను ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. గత పాలకులు పాలకవర్గం నిర్లక్ష్యం చేయడం వల్ల పరకాల పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్లయితే పరకాల పట్టణాన్ని అనుమకొండ జిల్లాలో అత్యంత సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దడం కోసం కౌన్సిలర్లతో కలిసి పని చేస్తానన్నారు.