ఇసుక లభ్యత గల ప్రాంతాల నుంచి రవాణాకు అనుమతులు ఇవ్వాలి – జిల్లాలో మరో పది ఇసుక రీచ్ ల ఏర్పాటు -డీ ఎల్ ఎస్ సీ సమావేశంలోకలెక్టర్ ప్రతీక్ జైన్
ముద్ర, నారాయణ పేట:
జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఇసుక రీచ్ లతో పాటు అదనంగా ఇసుక లభ్యత గల మరో పది రీచ్ లను ఏర్పాటు చేసి మన ఇసుక మన వాహనం ద్వారా రవాణాకు ఆన్ లైన్ అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో కలెక్టర్ అధ్యక్షతన డి.ఎల్.ఎస్.సి( డిస్టిక్ లెవెల్ స్యాoడ్ కమిటీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. మన ఇసుక మన వాహనం ద్వారా ప్రస్తుతం జిల్లాలోని వర్కూరు పరిధిలోని నాలుగు రీచ్ లతో పాటు ఉట్కూర్ మండలంలోనీ నాగిరెడ్డి పల్లి రీచ్ ల నుంచి ఇసుకను తరలించేందుకు ఆన్ లైన్ అనుమతులు జారీ చేస్తున్నామని, ఇకపై జిల్లాలో గుర్తించిన మరో పది ఇసుక రీచ్ ల నుంచి కూడా రవాణాను ఆన్ లైన్ అనుమతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఆయా రీచ్ లకు కే ఏం ఎల్ మ్యాపింగ్ చేసి రెవెన్యూ, మైనింగ్,భూగర్భ జల వనరుల శాఖ, నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే అమ్మి కుంట, నేరేడు గాం, సంగం బండ, మిశ్రిఫా, రాకొండ( చెక్ డ్యాం) పరిధిలోనూ ఇసుక లభ్యత, రవాణా పై అధికారులు క్షేత్ర సాయి పరిశీలన చేయాలన్నారు. గతంలో 21 రీచ్ లు ఉండగా, ఇప్పుడు నాలుగైదు రీచ్ లనే గుర్తించడం ఏమిటని, కనీసం 18 రీచ్ ల నుంచి మన ఇసుక మన వాహనం ద్వారా ఇసుక రవాణా కు అనుమతులు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. కాగ కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో మన రాష్ట్ర పరిధి ముగింపు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇదే నెలలో మరోసారి నిర్వహించే డీ ఎల్ ఎస్ సీ సమావేశంలో పది రీచ్ ల నుంచి ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది.