ఎన్నికల మెనిఫెస్టో హామీలు వెంటనే అమలు చేయాలి
వాటికి సరిపడ బడ్జెట్ కేటాయించాలి
ప్రజాభవన్ ముట్టడిలో కవిత
ముద్ర, తెలంగాణ బ్యూరో:
అసెంబ్లీ ఎన్నికల మెనిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ నెల 26న పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఇందులో మహిళలకు ఇచ్చిన హామీలు రూ. 2500, స్కూటీలు, తులం బంగారం కోసం నిధులు కేటాయించాలన్నారు. వీటితో పాటు ఆసరా పెన్షన్లను రూ. 2వేల నుంచి రూ.4వేలకు పెంచి నిధులు కేటాయించలన్నారు. అప్పటి వరకు తాము వేచి చూస్తామన్న కవి… ఆ తర్వాత అన్ని జిల్లాల్లో ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. అవసరమైతే సెక్రటేరియేట్, అసెంబ్లీనీ ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలుతో పాటు అంగన్ వాడీల సమస్యల పరిష్కారం కోసం ప్రజా భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన ఆమె, పెద్ద సంఖ్యలో మహిళలతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు గడుస్తున్నా, ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. అర్హులైన ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం పేరిట నెలకు రూ.2,500 చొప్పున, గత 26 నెలల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయంతో పాటు, హామీ ఇచ్చిన విధంగా తులం బంగారం పంపిణీ చేయాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతూ వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ చేస్తామన్న హామీ ఇచ్చి వంచించారని కవిత మండిపడ్డారు. అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలను వెంటనే పెంచాలని, పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మండిపడ్డారు.
బీఆర్ఎస్, బీజేపీ పొత్తుకు మున్సిపల్ ఎన్నికలు తొలిమెట్టు
బీఆర్ఎస్, బీజేపీ పొత్తుకు మున్సిపల్ ఎన్నికలు తొలిమెట్టు అని కవిత అన్నారు. బీఆర్ఎస్ మద్దతుతోనే బీజేపీ రాష్ట్రంలో ఒకటో, రెండో మున్సిపల్ చైర్మన్ పదవులు దక్కించుకుందన్నారు. ఈ రెండు పార్టీల పొత్తుపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలు నిజమని మున్సిపల్ ఎన్నికల్లో తేలిందన్నారు. కరీంనగర్, నారాయణ్ పేట్ లో ఛైర్మన్ ఎన్నికకు బీఆర్ఎస్ హాజరు కాలేదన్న ఆమె.. అంతర్గతంగా బీజేపీకి బీఆర్ఎస్ సహకరించటం కారణంగానే ఒకటో, రెండో సీట్లు వచ్చాయన్నారు. నారాయణ్ పేట లో తమకు వైస్ ఛైర్మన్ పదవి వచ్చేదన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్లు బెదిరింపులకు దిగి వైస్ ఛైర్మన్ పదవి రాకుండా చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు కచ్చితంగా ఉంటుందని జోస్యం చెప్పారు.