Take a fresh look at your lifestyle.

రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు చేయాలి

  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి.
  • వ్యవసాయ శాఖ మంత్రికి బీఆర్ఎస్ బృందం వినతి.
  • 9 మండలాలకు రైతు భరోసా నిలిపివేత అన్యాయం.
  • జిల్లాలోని రైతులందరికీ భరోసా నిధులు విడుదలకు డిమాండ్.

ఇబ్రహీంపట్న, ముద్ర విలేకరి: రంగారెడ్డి జిల్లాలో అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని రైతులకు ఇతర రైతుల మాదిరిగానే రైతు భరోసా ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చివరి మూడు, నాలుగు రోజులుగా వర్షాకాలం సీజన్ పంటలకై రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సహాయం అందించడం ప్రారంభించిందని చెప్పారు.అయితే రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, బాలాపూర్, మహేశ్వరం, శంషాబాద్, రాజేంద్రనగర్, గండిపేట, శేరిలింగంపల్లి మండలాల్లోని 48,184 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న 36,220 మంది రైతులకు రైతు భరోసా నిధులు జమ కాలేదని తెలిపారు. తాము కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతులమేనని, వ్యవసాయం చేస్తూనే ఉన్నామని, అందువల్ల తమకు కూడా పెట్టుబడి సహాయం అందించాలని అన్నారు. కొంతమంది రైతులకు మాత్రమే రైతు భరోసా అమలు చేయడం అన్యాయమన్నారు. వచ్చే 10 రోజుల్లో ఆయా మండలాలకు చెందిన రైతులకు కూడా రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షం భారీ స్థాయిలో ఉద్యమానికి దిగుతామని స్పష్టం చేశారు. మంత్రిని కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, రైతు బంధు జిల్లా మాజీ అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎస్వీ రమణారెడ్డి, మాజీ ఎంపీపీ కృపేశ్, మాజీ జడ్పీటీసీ కర్నాటి రమేష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు విఠల్ రెడ్డి, కిషన్ గౌడ్, ఆకుల యాదగిరి, పాశం దామోదర్, పశ్చ భాష, బూడిద రాంరెడ్డి, అంజిరెడ్డి, జేర్కొని రాజు, బుగ్గరాములు, నిట్టు జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.