ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కోర్టులో జ్యూడిషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి తిరుమలా దేవి హాజరై పలు ముఖ్య అంశాలపై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నంబావి మండలంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో కోర్టుల పనితీరు సంతృప్తికరంగా ఉందని, పెండింగ్ కేసుల వేగవంత పరిష్కారంపై ప్రశంసలు వ్యక్తం చేశారు.
జిల్లా జడ్జి రమాకాంత్ సేవలను అభినందించిన ఆమె, న్యాయవాదుల సహకారంతో కేసుల త్వరితగతిన పరిష్కారం సాధ్యమైందని పేర్కొన్నారు. అలాగే నాగర్ కర్నూల్ కోర్టు భవనానికి అదనపు అంతస్తు నిర్మాణం ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
కల్వకుర్తి, అచ్చంపేటలో అదనపు కోర్టు భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, జిల్లాలో మరో సబ్ కోర్టు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. కోర్టుల మౌలిక వసతుల అభివృద్ధికి హైకోర్టు నుంచి పూర్తి సహకారం అందుతుందని హామీ ఇచ్చారు.
జిల్లా నుంచి ఎలాంటి కీలక సమస్యలు లేవని అడ్మినిస్ట్రేటివ్ జడ్జి తెలిపారు. ఈ సమావేశంలో పోక్సో స్పెషల్ జడ్జి నజీమా సుల్తానా సహా పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.