ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ :
జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నెల్లికొండ చౌరస్తా వద్ద శ్రీశైలం రోడ్డు పై రైతులు ధర్నా నిర్వహించి తమ నిరసన తెలిపారు.
గత నాలుగు రోజులుగా గన్నీ బ్యాగులు సరఫరా చేయకపోవడంతో కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయిందని రైతులు తెలిపారు. తూకం వేసిన మొక్కజొన్న బస్తాలను కూడా సమయానికి తరలించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నిల్వలో ఉన్న పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే లారీలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను డిమాండ్ చేశారు.
రైతుల ధర్నాతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమస్యను తక్షణమే పరిష్కరించాలని రైతులు అధికారులను కోరారు.