• రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
• విద్యుత్ సబ్ స్టేషన్, రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
ముద్ర, పాలేరు: రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించారు. మద్దులపల్లి నుండి తెల్దారుపల్లి జెడ్పీ రోడ్డు వరకు కోటి 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, గూడూరు పాడు నుండి గోళ్లపాడు –ఊట వాగు తండ రోడ్డు వరకు రూ. 2.97 కోట్లతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తరుణీ హాట్లో 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న 33/11కీవీ విద్యుత్ ఉప కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాలలో సబ్ స్టేషన్లను అభివృద్ధి చేస్తుందని, అందులో భాగంగానే ఖమ్మం రూరల్ మండలంలో విద్యుత్ సమస్యను నివారించేందుకు ఈ సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టామన్నారు.

పేదల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం నిబద్దతతో పని చేస్తుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేక పోయినా ఎక్కడా వెనకడుగు వేయకుండా చిత్తశుద్ధితో పని చేస్తున్నామని చెప్పారు. గడిచిన 15 నెలల్లో అన్ని శాఖలు ప్రక్షాళన చేసి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా అందిస్తున్నామన్నారు. చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను వర్షాకాలంలోగా పూర్తి చేయాలని అధికార్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్, ఆపరేషన్ సర్కిల్ ఎస్.ఈ.- ఈ. శ్రీనివాస చారి, మద్దుల పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బి.హరినాథ్ బాబు, ఆర్డీఓ నరసింహా రావు, తహసీల్దార్ రామ్ ప్రసాద్, డి.ఈ. సి.హెచ్. నాగేశ్వర్ రావు, డి.ఈ. హీరాలాల్ తదితరులు పాల్గొన్నారు.