Take a fresh look at your lifestyle.

తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు : గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భారతదేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్టలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యంతో రేవంత్ రెడ్డి అజెండాతో అనేక మున్సిపాలిటీలో దౌర్జన్యంగా మున్సిపల్ చైర్ పర్సన్ సీట్లను కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. కౌన్సిలర్లను డబ్బులకు కొనుగోలు చేయడం లేదంటే బెదిరింపులకు పాల్పడడం లేదా వివిధ మార్గాలను ఎంచుకోవడం చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటు కార్యకర్తలు వాళ్ళ వాళ్ళ పార్టీల అభ్యర్థులను కష్టపడి గెలిపించుకుంటే వాళ్లకి అధికారం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇకనుంచి ఎన్నికలు పెట్టకుండా మీకు ఇష్టం వచ్చిన వారికి నామినేటెడ్ చేసుకొని ఈ రాజ్యాన్ని ఏలుకోండని సలహా ఇచ్చారు.
ఇంకా రెండున్నర సంవత్సరాలు మీ ఆటలు సాగుతాయి వచ్చే ప్రభుత్వం మా కేసీఆర్ ప్రభుత్వమే అప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంటో బి ఆర్ ఎస్ పార్టీ చూపిస్తదన్నారు. ఆమె వెంట బి ఆర్ ఎస్ నాయకులు కర్ర వెంకటయ్య ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.