- కాంగ్రెస్ అధిష్టానం వద్ద పావులు కదుపుతున్న చెవిటి?
- జడ్పిటిసి గా పోటీ చేసే స్థానంపై కన్నేసిన చెవిటి?
- బీసీ నినాదంతో ఎన్నికల బరిలోకి చెవిటి వెంకన్న యాదవ్ రానున్నాడా?
- చెవిటి ప్రయత్నాలు ఫలించి చైర్మన్ పదవి దక్కించుకుంటాడా?
తుంగతుర్తి ముద్ర : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి చైర్మన్ పదవి రేసులో తానుంటాను అనే మాట స్పష్టంగా చెబుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.ఇందుకు సంబంధించి చెవిటి వెంకన్న యాదవ్ అధిష్టానంతో తనకున్న సత్సంబంధాలను ఉపయోగించుకుని జడ్పీటీసీగా పోటీ చేసి జిల్లా పరిషత్ చైర్మన్ కావాలనే యోచనతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి అలాగే ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లతోపాటు జిల్లా మంత్రుల సహకారం తీసుకుని జడ్పీ చైర్మన్ పదవి పొందాలని పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అరంగేట్రం చేసిన చెవిటి వెంకన్న యాదవ్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ మండల పార్టీ ఉపాధ్యక్షుడుగా, జిల్లా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడు రెండుసార్లు ఆ పదవి చెవిటి వెంకన్న యాదవ్ కి రావడం గమనార్హం.అలాగే అంతకుముందు తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా రెండు పర్యాయాలు కొనసాగారు. తుంగతుర్తి నియోజకవర్గం తో పాటు ఇతర నియోజకవర్గాల్లో సైతం తన పలుకుబడిని పెంచుకోవడానికి కృషి చేశారు. ముఖ్యంగా బీసీ నాయకులు బీసీ వర్గాల్లో చెవిటి వెంకన్న యాదవ్ తనదైన ముద్ర వేసుకున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దన్న గా నిలిచారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తన అనుచరగణాన్ని పెంపొందించుకున్నారు.జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా తుంగతుర్తి నియోజకవర్గం, సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడలో సైతం మంచి పేరు తెచ్చుకున్నారు.ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ అధిష్టానాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు.తనకున్న మంచి పేరుతో పాటు అధిష్టానంతో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుని జిల్లా పరిషత్ చైర్మన్ కావాలన్నదే ధ్యేయంగా చెవిటి వెంకన్న యాదవ్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు విశ్వసినీయంగా తెలుస్తోంది. బీసీలకు సరైన న్యాయం జరగాలని కిందిస్థాయి నుండి వచ్చిన వారికి పార్టీ పదవులు చట్టబద్ధమైన పదవులు రావాలని తన అనుయాయుల వద్ద అంటున్నట్లు తెలుస్తోంది. రానున్న కాలంలో తుంగతుర్తి నియోజకవర్గం డీలిమిటేషన్ జరిగి ఒక వేళ జనరల్ కేటగిరిలో రిజర్వేషన్ అయ్యే పక్షంలో తాను సైతం పోటీలో ఉండే అవకాశం ఉంటుందని తన సహచరుల వద్ద అంటున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా జిల్లా పరిషత్ చైర్మన్ గా గాని లేదా రానున్న కాలంలో డీలిమిటేషన్ జరిగి తే జనరల్ స్థానంలోనైనా తాను బరిలో ఉంటాను అనే మాట అంటున్నట్లు తెలుస్తోంది. చెవిటి వెంకన్న యాదవ్ జిల్లా పరిషత్ చైర్మన్గా అవ్వడానికి జెడ్పిటిసిగా ఎక్కడ నుండి పోటీ చేయాలో ఇప్పటికే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.మరి చెవిటి ఆలోచనలను అధిష్టానం మన్నిస్తుందా? జిల్లా పరిషత్ చైర్మన్ గా బీసీ నాయకుడిగా ఉన్న చెవిటికి అవకాశం ఇస్తుందా? లేదా! వేచి చూడాల్సిందే.

