Take a fresh look at your lifestyle.

జగన్ రాజకీయాలపై తీవ్ర విమర్శలు.. విధ్వంసకర రాజకీయాలకు ముగింపు పలకాలని మంత్రి నిమ్మల పిలుపు

ఎన్టీఆర్ భవన్, మంగళగిరి

-జగన్ గొడ్డలి రాజకీయం… వినాశనం నుంచి విధ్వంసం వరకు
 –జగన్ రాజకీయాలు ఉగ్రవాదం కంటే భయంకరం
-“నరుకుతాం.. చంపేస్తాం” అనే నీచమైన భాష వైసీపీ సంస్కృతికి నిదర్శనం
-రాజకీయాల కోసం సొంత బాబాయ్‌నే గొడ్డలితో వేటు వేసిన చరిత్ర జగన్ రెడ్డిది
-తల్లిని, చెల్లిని బయటకు గెంటిన జగన్.. మహిళా పక్షపాతి అని చెప్పుకోవడం నయవంచన
-“జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి” అని విజయమ్మ నాడే చెప్పారు
-రంగాను అవమానించిన గౌతమ్ రెడ్డికి పదవులు ఇచ్చి సత్కరించిన జగన్

 

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చూస్తుంటే అవి రాజకీయాల్లా లేవు, ఉగ్రవాదులను మించిన ఉన్మాదంతో సాగుతున్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిస్సిగ్గుగా విధ్వంసకర విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని ఆయన విమర్శించారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..జగన్మోహన్ రెడ్డి తన హిడెన్ అజెండాను ఇప్పుడు బహిరంగంగానే ప్రజలకు చెబుతున్నారు. “చంపేస్తాం, నరికేస్తాం, అంతుచూస్తాం” అనే నీచమైన భాషను వాడుతూ రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటుగా మారింది. అధికారం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా వారి తీరు ఉంది. ప్రజలకు మేలు చేస్తామని చెప్పాల్సిన రాజకీయ పార్టీలు పోయి.. మేము వస్తే ఉన్నవి పడగొడతాం, పనులు ఆపేస్తాం, యువతను చెడగొడతాం, మాదక ద్రవ్యాలు అమ్మిస్తాం అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. కనీసం బంధుప్రీతి కూడా లేకుండా, రాజకీయాలకు అడ్డువస్తే సొంత బాబాయ్‌నైనా గొడ్డలిపోటుతో అంతం చేస్తామనే భయంకరమైన సందేశాన్ని వీరు ప్రజల్లోకి పంపుతున్నారు. “నా తల్లి, నా చెల్లి” అంటూనే వారిని ఏ రకంగా చూసుకున్నారో రాష్ట్రం మొత్తం చూసింది. ఇప్పుడు రాష్ట్రంలోని 50 శాతం ఉన్న మహిళలకు అంతకంటే ఎక్కువ చేస్తాను అనడం వారిని వంచించడమే. అలాగే వైసీపీ ‘యూత్ పాలసీ’ అంటే మద్యం వ్యాపారాలు చేయడం, కొత్త కొత్త మాదక ద్రవ్యాలను అందుబాటులోకి తెచ్చి యువత భవిష్యత్తును నాశనం చేయడమేనా? అని మంత్రి ప్రశ్నించారు.
ఏ పార్టీ అయినా శాంతిభద్రతలు కాపాడతామని చెబుతుంది. కానీ వైసీపీ మాత్రం ‘గొడ్డలి పార్టీ’గా మారిపోయింది. 2029లో పొట్టేళ్లను నరికినట్లు తలలు నరికేస్తాం అని బహిరంగంగా గొడ్డళ్లతో రోడ్ల మీద తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. జంతువులను నరికి ఆ రక్తాన్ని ఫ్లెక్సీల మీద చిమ్ముతూ రాక్షసానందం పొందే నాయకులు ప్రజలకు ఏం మేలు చేస్తారని నిలదీశారు. వైసీపీ నాయకుల భాష, వారి ఆలోచనా విధానం చూస్తుంటే ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటోందని మంత్రి మండిపడ్డారు. ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన నాయకులే బాహాటంగా హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు ఎంతటి తెగింపుతో మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. “గుంటూరు ఇవతల ఇంటిలో నుంచి బయటకు లాగి కొడతాం.. గుంటూరు అవతల ఇంటిలోకి వెళ్లి నరుకుతాం” అని బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. వీరికి అధికారం కావాల్సింది అభివృద్ధి కోసం కాదు, సంక్షేమం కోసం కాదు.. కేవలం తల్లులకు పుత్రశోకం మిగిల్చడానికి, భార్యలకు మాంగల్య దూరం చేయడానికే వీరు అధికార దాహంతో రగిలిపోతున్నారు. రేపటి రాష్ట్ర భవిష్యత్తును ఒక స్మశానవాటికలా మార్చడమే వైసీపీ లక్ష్యమా? అని ప్రశ్నించారు. నిజాలను నిర్భయంగా వెల్లడిస్తున్న ఏబీఎన్ మీడియా సంస్థపై, వారి ప్రతినిధులపై జగన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు ఉన్మాదంతో మాట్లాడుతున్నారు. “నాలుకలు కోస్తాం.. అంతం చేస్తాం.. కొత్త పలుకు వినిపించకుండా చేస్తాం” అని ఒక మీడియా సంస్థను బెదిరించడం అంటే, అది సాక్షాత్తూ రాజ్యాంగం కల్పించిన ఫోర్త్ ఎస్టేట్ గొంతు నొక్కడమే. ఇలాంటి మాటలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. 151 సీట్లు ఉన్న పార్టీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారంటే, జగన్ రెడ్డి పరిపాలనపై ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాలి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితిలో ఉన్నా, జగన్ రెడ్డికి బుద్ధి రాలేదు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకుండా, మరింత రెచ్చిపోయి ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు. నాడు తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న ‘ఆర్థిక ఉగ్రవాది’ జగన్ రెడ్డి, నేడు ‘రాజకీయ ఉగ్రవాది’గా మారిపోయారు. వైసీపీ జెండాను పక్కన పెట్టి ‘గొడ్డలి’ని జెండాగా చేసుకున్నారు. రక్త చరిత్రనే తన రాజనీతిగా భావిస్తున్న జగన్ రెడ్డి, వైసీపీని ‘గొడ్డలి పార్టీ’గా మార్చేశారని ఎద్దేవా చేశారు.
కడప జిల్లాలో వివాదరహితుడిగా పేరున్న వివేకానందరెడ్డి గారిని జగన్ తన రాజకీయ భవిష్యత్తు కోసం వాడుకున్న మాట వాస్తవం కాదా? ఆయన ఎంపీగా ఉన్నప్పుడు భయపెట్టి బలవంతంగా రాజీనామా చేయించిన లెటర్ పంపిస్తే.. నాడు సోనియా గాంధీ గారు జగన్ రెడ్డిని మందలించిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి గారు గొడ్డలిపోటుతో హత్యకు గురైతే, దాన్ని ‘గుండెపోటు’ అని సాక్షి పేపర్, ఛానళ్లలో ఎందుకు ప్రచారం చేశారు? సొంత చిన్నాన్న చనిపోతే గంటలో రావాల్సిన వ్యక్తి, 12 గంటలు ఆలస్యంగా వచ్చి సాక్ష్యాలు చెరిపేయడంలో నిమగ్నమవ్వడం దేనికి సంకేతం? ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా చనిపోయిన వ్యక్తికి కుట్లు వేసి, డ్రెస్సింగ్ చేసి హత్యను కప్పిపుచ్చే ప్రయత్నం ఎవరైనా చేస్తారా? అని జగన్ రెడ్డిని నిలదీశారు. పరిటాల రవి హత్య కేసు నుంచి బయటపడటానికి జగన్ కు ఆరు నెలలు పట్టిందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు. ఆనాడు పరిటాల రవి కేసులో సాక్షులు ఎలాగైతే ఒక్కొక్కరుగా మాయమయ్యారో, నేడు వివేకా హత్య కేసులో కూడా సాక్షులను అదే రకంగా మాయం చేస్తున్నారని ఆరోపించారు. దీనికి జగన్ సమాధానం చెప్పాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి, ఆయన ఆచూకీ కూడా లభించని విషాద సమయంలో.. సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి కావాలని చూడటం జగన్ రెడ్డి వికృత మనస్తత్వానికి నిదర్శనం. ఆ రోజుల్లోనే విజయమ్మ గారు స్వయంగా రోశయ్య గారికి ఫోన్ చేసి.. “జగన్ రాకను తండ్రి రాజశేఖర్ రెడ్డి గారే ఇష్టపడలేదు, మీరు చెప్పి అతన్ని బెంగళూరులోనే ఉండమనండి” అని వేడుకున్నారంటే జగన్ పద్ధతి ఎలాంటిదో ప్రజలు అర్థం చేసుకోవాలి. తండ్రి మరణానికి రిలయన్స్ సంస్థే కారణమని నాడు దాడులు చేయించి, నేడు అదే సంస్థకు జగన్ రెడ్డి రాజ్యసభ పదవులను ఎలా అప్పగించారు? కేవలం తన స్వార్థం కోసం ఎవరినైనా వాడుకుని, ఎవరితోనైనా చేతులు కలిపే నైజం జగన్ రెడ్డిది.హత్యలు చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా రాజకీయాలు చేస్తున్న జగన్ రెడ్డి వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు.
వంగవీటి రంగా గారి గురించి కానీ, కాపు సామాజికవర్గం గురించి కానీ మాట్లాడే కనీస నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని మంత్రి ఘాటుగా విమర్శించారు. రంగా గారి హంతకులను అక్కున చేర్చుకున్న చరిత్ర జగన్ రెడ్డిదని ధ్వజమెత్తారు. వంగవీటి రంగా గారి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి కుమారుడు ఈరోజు ఏ పార్టీలో ఉన్నారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. రంగా గారిని పొట్టనబెట్టుకున్న కుటుంబానికి హైదరాబాద్‌లో కోట్లాది రూపాయల విలువైన భూమిని ‘గిఫ్ట్’గా ఎందుకు ఇచ్చారో ప్రజలకు వివరించాలి. హంతక కుటుంబాలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ, రంగా గారి పేరు ఎత్తడానికి జగన్ రెడ్డికి సిగ్గుండాలి. రంగా గారిని రౌడీ అని పిలుస్తూ, కాపుల మనోభావాలను దెబ్బతీసిన గౌతమ్ రెడ్డిని జగన్ ఎందుకు హక్కున చేర్చుకున్నారు? అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి ‘ఫైబర్ గ్రిడ్ చైర్మన్’ పదవి ఇచ్చి సత్కరించడం రంగా గారిపై జగన్ రెడ్డికి ఉన్న విద్వేషానికి నిదర్శనం కాదా? నాడు తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని ఆర్థిక వ్యవస్థను కలుషితం చేసిన జగన్ రెడ్డి, పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ వ్యవస్థను, అధికారంలోకి వచ్చాక పరిపాలనా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. అధికారులను, రాజకీయ నాయకులను సైతం తన నేర స్వభావంతో కలుషితం చేసిన వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హతే లేదు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన కంటే, 2019-24 మధ్య జరిగిన వైసీపీ ఐదేళ్ల పాలన వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోలుకోలేని నష్టం జరిగింది. ఆ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలోని ప్రధాని మోదీ గారి సహకారంతో రాష్ట్రాన్ని మళ్లీ పట్టాలెక్కిస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్దివైపు నడిపిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంటే, మళ్లీ విధ్వంసం సృష్టించాలని జగన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. గొడ్డలిని జెండాగా, వినాశనాన్ని అజెండాగా పెట్టుకున్న ఈ ‘గొడ్డలి పార్టీ’కి రాజకీయ సమాధి కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి ఉన్మాద పార్టీని రాష్ట్రంలో లేకుండా శాశ్వతంగా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఈ రాక్షస పాలన పోకడలను అడ్డుకోవాలని మంత్రి నిమ్మల పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.