ముద్ర న్యూస్ , ధర్మపురి:
విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమాల్లో విద్య వారోత్సవాలను పురస్కరించుకొని ధర్మపురి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్‌లు, కౌన్సిలర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, డ్రాప్‌అవుట్‌ల నివారణ, పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాల కల్పనపై సర్పంచ్‌లు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కోరారు. గ్రామాల్లో విద్యాపై అవగాహన పెంచడం ద్వారా సమాజ అభివృద్ధికి బాటలు వేయవచ్చని అన్నారు.
ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శంగా నిలవాలంటే ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుంటేనే రాష్ట్ర భవిష్యత్తు బలోపేతం అవుతుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధాని పర్యటన ముగిసిన మరుసటి రోజే బండి సంజయ్ కుమారుడి కేసుపై ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించిందని తెలిపారు. సిట్ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానించడం దౌర్భాగ్యకరమని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో కూడా బండి భగీరథపై మీడియాలో పలు కథనాలు వచ్చాయని, అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చట్టానికి ఎవరు అతీతులు కాదని, పోలీసులు చట్టపరంగా తమ విధులు నిర్వర్తిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.