రానున్న రోజుల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఉండవు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో వస్తాం
మేలో సొంత పార్టీ పెట్టబోతున్న
బీఆర్ఎస్ నాయకులు టచ్‌లో ఉన్నారు
సిద్ధిపేట లేదా బోధన్ నుంచి పోటీ చేస్తా
మీడియాతో జాగృతి అధ్యక్షురాలు కవిత
ముద్ర. తెలంగాణ బ్యూరో :
రానున్న రోజుల్లో అధికార కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతామని జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడించారు. పార్టీ పెట్టాక తామే ప్రధాన ప్రతిపక్షం అవుతామని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉండవని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో కేబినెట్ ఎర్రవెల్లికి వెళితే ఇప్పుడు ఢిల్లీకి వెళ్తోందని కవిత సెటైర్లు వేశారు. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలంటే సచివాలయంలో మంత్రివర్గం సమావేశాలు జరగాలన్నారు. గురువారం జూబ్లీహీల్స్ లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలో వస్తామన్న ఆమె.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వస్తే ఏదో ఒక పార్టీ గుర్తుపై పోటీ చేస్తామని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు పార్టీ ఏర్పాటు పూర్తి అయితే సొంత పార్టీ గుర్తుపై పోటీకి దిగుతామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు చాలా మంది తనతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు వారి వివరాలు వెల్లడిస్తానని అన్నారు. వైఎస్ షర్మిలతో తనను పోలుస్తూ మాట్లాడటం తగదని కవిత హితవు పలికారు. షర్మిల ఓ జాతీయ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారని అన్నారని గుర్తు చేశారు. మహిళల రాజకీయ జీవితాల గురించి మాట్లాడే వారు పార్టీలు పెట్టిన మగవారిపై ఎందుకు చర్చించరని మండిపడ్దారు. ఆడవాళ్లనే ఎందుకు ప్రస్తావిస్తారని, చిరంజీవి గురించి ఎందుకు మాట్లాడరని దుయ్యబట్టారు. కేటీఆర్ ఉద్యమ ద్రోహులను తన పక్కన పెట్టుకోని మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎవరు ఉద్యమకారులో, ఎవరు ఉద్యమ ద్రోహులో రానున్న రోజుల్లో ప్రజలే తేల్చుతారన్నారు.
మే మొదటి వారంలో పార్టీ
మే మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు కవిత ప్రకటించారు. పార్టీ పేరులో ‘తెలంగాణ’అనే పదం ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర అస్తిత్వాన్ని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తమ పార్టీ పేరు ఉంటుందని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానన్న కవిత… తన తొలి ప్రాధాన్యం హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిద్దిపేట అన్నారు. రెండోది బోధన్ అన్నారు.
తాము స్థాపించబోయే పార్టీలో యువత, కొత్త వారికి పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు.
ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యమం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇంత వరకు ఆ హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. విలీన బిల్లును గత ప్రభుత్వం పెడితే… గవర్నర్ దాన్ని ఆమోదించలేదన్నారు. ఆర్టీసీ కార్మికులు శ్రమ దోపిడీకి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్ధలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోన్న ప్రభుత్వం.. బస్సుల సంఖ్యను పెంచలేదని ఆరోపించారు. ఆర్టీసీపై ప్రభుత్వం శ్వేత పత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 52 రోజులు సమ్మె జరిగితే 33 మంది కార్మికులు చనిపోయారని గుర్తు చేశారు. ఆ సమయంలో గత ప్రభుత్వం ఆర్టీసీ యూనియన్లను రద్దు చేస్తే కాంగ్రెస్ వచ్చాక పునరుద్ధరిస్తామన్నారు.. ఇప్పటి వరకు హామీ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాకుండా పర్మినెంట్ ఉద్యోగులను తీసుకోవాలన్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ భాద్యత తీసుకోవాలని కోరారు. ఆర్టీసీని మేఘా సంస్థకు ధారాధత్తం చేసే కుట్ర జరుగుతుందని కవిత ఆరోపించారు. అందుకే ఆర్టీసీని బతికించుకోవాల్సిన అవసరముందని అబిప్రాయపడ్డారు. ఆర్టీసీకి ఛైర్మన్, యూనియన్లు లేకపోవటంతో అధికారుల జులుం భరించలేని పరిస్థితికి చేరిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగొచ్చి.. యూనియన్ల పునరుద్ధరణ జరిగే వరకు ఉద్యమం చేపడతామన్నారు.