Take a fresh look at your lifestyle.

జీహెచ్ఎంసీ పునర్విభజనపై హైకోర్టు సీరియస్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం
జీవో 55 ను రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన గురువ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

జీహెచ్ఎంసీ పునర్విభజనపై హైకోర్టు సీరియస్ అయింది. జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గురువారం నోటీసులు జారీ చేసింది. జనగణన–2027 కోసం జూరిస్డిక్షనల్ ఫ్రీజ్ అమలులో ఉన్న సమయంలో జీహెచ్ఎంసీ పునర్విభజన చట్ట విరుద్ధం అని పేర్కొంటూ జీవో నంబర్ 55ను దరం గురువ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేషన్ కుమార్ సింగ్ ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ రాజ్‌కుమార్ గుమ్మి.. జనగణన కార్యక్రమాల కోసం ఒకసారి జ్యూరిస్డిక్షన్ ఫ్రీజ్ ప్రకటించాక మున్సిపల్ సరిహద్దుల మార్పులు, స్థానిక సంస్థల పునర్వ్యవస్థీకరణ అనుమతించబడవని కోర్టుకు దృష్టికి తీసుకువచ్చారు. అలాంటి చర్యలు ప్రారంభం నుంచే చెల్లవని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని చట్ట విరుద్ధంగా, అధికార పరిధి లేకుండా జారీ చేసిన జీవో 55 ను రద్దు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ తరఫున వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలైన అనంతరం ఈ కేసును తదుపరి విచాణకు కోర్టు తీసుకోనుంది. కాగా జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ)గా విభజిస్తూ జీవో నంబర్ 55 ను ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.