Take a fresh look at your lifestyle.

స్థానిక సంస్థలు ఆదాయ మార్గాలను పెంచుకోవాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

99 రోజుల ప్రణాళిక శిక్షణ కార్యక్రమం

మహదేవపూర్, ముద్ర:

పంచాయతీలు, మున్సిపాలిటీలు ఆదాయ మార్గాలను పెంచుకుని గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి చేయాలని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.

గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాలులో సర్పంచులు, కౌన్సిలర్లుకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. 99 రోజుల ప్రణాళికలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పంచాయతిలు, మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా తయారు చేయాలని తెలిపారు.

ప్రజలను ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని, శిక్షణను ఆచరణలో పెట్టాలని ప్రజాప్రతినిధులను కోరారు. విరిగిన వంగిన విద్యుత్తు పోల్స్, విద్యుత్తు వైర్లు, ఇండ్లపై నుండి వెళ్తున్న 11 కెవి విద్యుత్తు వైర్లు గుర్తించి వాటిని తొలగించాలన్నారు. గ్రామాలు, పట్టణంలో కోతులు, కుక్కల బెడద నివారణకు స్థానిక వనరుల ద్వారా ఆదాయం సమకూర్చుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు, బాలికలు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా హెచ్ పివి వాక్సిన్ వేయించాలని తెలిపారు.అలాగే మహిళా సంఘాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. గ్రామాలు, మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి జాబితా తయారు చేసి ప్రజలకు తెలియ చేయాలన్నారు. గ్రామాలు, పట్టణంలో సర్పంచు లు, చైర్మన్లు ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలాగ చేపట్టాలన్నారు. అన్ని గ్రామాల సర్పంచులకు, మున్సిపల్ చైర్మన్ కు 99 రోజుల కార్యక్రమం షెడ్యూల్ ఇచ్చామని తుచ తప్పక అమలు చేయాలని కోరారు. అనంతరం పంచాయతి, మున్సిపల్, వైద్య, పోలీస్, రవాణా, సంక్షేమ శాఖల అధికారులు, వ్యవసాయ, ఎక్సైజ్, విద్యా, యువజన సర్వీసులు క్రీడల శాఖ, అటవీ శాఖల అధికారులు ఆయా శాఖల ద్వారా చేపట్టనున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాలికలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డిఓ హరికృష్ణ, ఎఎస్పీ నరేష్ కుమార్, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, అన్ని శాఖల జిల్లా అధికారులు, కౌన్సిలర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.