Take a fresh look at your lifestyle.

మార్చి 20న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌ గా వైద్య విధాన పరిషత్‌
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తుది జన గణన
ఎల్‌ అండ్‌ టీ నుంచి మెట్రో రైలు స్వాధీనం
కాంగ్రెస్‌ ఆఫీసులకు జిల్లాల్లో భూకేటాయింపులు
ఇండ్ల గణనపై సుదీర్ఘ చర్చ
34 ప్రశ్నలతో ఇంటింటి గణన
89 వేల మంది సిబ్బంది నియామకం
మే 11 నుండి జూన్ 9 వరకు ఇండ్ల నమోదు
మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

వచ్చే నెల 16 నుంచి 30వ తేది వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. అదే నెల 16న గవర్నర్ ప్రసంగం, 17, 18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, మార్చి 20వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గం 28వ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇందులో సీఎం, మంత్రులతో కలిసి రాష్ట్ర పురోగతికి సంబంధించిన పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కేంద్రం తెలంగాణలో చేపట్టే కులగణన, హైదరాబాద్ మెట్రో రైలు వ్యవహారం, వైద్య విధాన పరిషత్‌లో మార్పులు , భూ కేటాయింపులు, అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ ప్రవేశం అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలోని వైద్య రంగంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కేబినెట్… ‘తెలంగాణ వైద్య విధాన పరిషత్‌’ పేరును ఇకపై ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌’గా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మార్పుతో పాటు, ఇప్పటివరకు పరిషత్‌ పరిధిలో ఉన్న ఉద్యోగులను పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని నిర్ణయించారు. దీంతో వేలమంది వైద్య సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. రాజకీయ పార్టీల బలోపేతానికి సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి భూమిని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరికొన్ని కీలక భూ కేటాయింపులపై కూడా కేబినెట్ స్పష్టతనిచ్చింది. ఖమ్మం జిల్లాలో టీటీడీ ఆలయ నిర్మాణం లేదా ఇతర ఆధ్యాత్మిక సేవల కోసం 20 ఎకరాల భూమిని కేటాయించారు. మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో కొత్తగా జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణానికి గాను 70 ఎకరాల భారీ కేటాయింపుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిపాలనా సౌలభ్యం కోసం , రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం తీసుకున్న ఈ నిర్ణయాలు తక్షణమే   అమలులోకి రానున్నాయి.

కేంద్ర కులగణనకు ఓకే
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జన గణన ప్రక్రియను తెలంగాణలో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ భారీ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. దానికనుగూణంగా అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ సమావేశంలో ముఖ్యంగా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన తొలి విడత ఇండ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను కేబినెట్‌కు వివరించారు. మే 11న ఈ గణనను ప్రారంభించి జూన్ 9వ తేదీ వరకు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. మరోవైపు ఈ హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్దేశించిన 34 ప్రశ్నలతో కూడిన నమూనా పత్రాన్ని ప్రభుత్వం వినియోగించనుంది. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి వివరాలు సేకరించేందుకు సుమారు 84 వేల మంది ఎన్యుమరేటర్లను, వారికి దిశానిర్దేశం చేసేందుకు నోడల్ ఆఫీసర్లను కలిపి మొత్తం 89 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను ఈ విధుల్లో భాగస్వాములను చేయనున్నారు. తొలి దశ విజయవంతంగా ముగిసిన తర్వాత, అసలైన రెండో దశ జన గణన ప్రక్రియను వచ్చే ఏడాది అంటే 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల అంచనాకు ఈ గణన ఎంతో కీలకం కానున్న నేపథ్యంలో, ఎలాంటి లోపాలు లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

‘మెట్రో’ స్వాధీనం
హైదరాబాద్‌ మెట్రో రైలును ఎల్‌ అండ్‌ టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. స్వాధీనం చేసుకునే ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఈ కమిటీలో.. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులు. గత ఏడాది సూత్రప్రాయంగా జరిగిన ఒప్పందంలో రూ.2 వేల కోట్ల ఈక్విటీని ఏకమొత్తంగా ఎల్‌అండ్‌టీకి చెల్లించేలా.. రూ.13 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం బదలాయించుకునేలా అవగాహనకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే స్వాధీన ప్రక్రియ మొదలైంది. మెట్రో ఆస్తులు, వాటి విలువను ఐడీబీఐ క్యాపిటల్‌.. రైళ్లు, ట్రాక్‌లు, సిగ్నలింగ్‌ వ్యవస్థ వంటి సాంకేతిక అంశాలపై డీఎంఆర్‌సీ మదింపు చేసి ప్రాథమిక నివేదికలిచ్చాయి.

Leave A Reply

Your email address will not be published.