రాష్ట్రంలో కొత్త పాలసీ
ఇక ఫాంహౌస్ నిర్మాణానికి పర్మిషన్
ప్రత్యేక విధానంలో అనుమతులు
నిబంధనలు ప్రకారం ఉంటేనే అనుమతి
ముద్ర, తెలంగాణ బ్యూరో:
ఫాంహౌస్‌లు నిర్మాణానికి పర్మిషన్ తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త పాలసీపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఫాంహౌస్‌లు నిర్మించేందుకు ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఇప్పటివరకు ఫాంహౌస్‌ల నిర్మాణాలకు ఎలాంటి స్పష్టమైన రూల్స్ లేకపోవడంతో.. ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు జరుగుతున్నాయని భావించిన ప్రభుత్వం.. సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టేందుకు రెడీ అయింది.
ఫాంహౌస్ డిమాండ్
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్, జనాల రద్దీ, పొల్యూషన్ తట్టుకోలేక.. వీకెండ్, సెలవులు వచ్చాయంటే చాలు.. నగరవాసులు నగరం బయటికి వెళ్లి ఫాంహౌస్‌లలో సేద తీరుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరం చుట్టుపక్కల వేల సంఖ్యలో ఫౌంహౌస్‌లు ఉన్నాయి. కొన్ని చాలా ఏళ్ల క్రితమే నిర్మితం కాగా.. మరికొన్ని ఇటీవలి కాలంలో పుట్టుకొచ్చాయి. అయితే మన రాష్ట్రంలో ఫాంహౌస్‌ల నిర్మాణానికి పర్మిషన్లు, విధి విధానాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. ఈ నేపథ్యంలోనే దీనిపై రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఫాంహౌస్ నిర్మాణాలకు ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.
నిబంధనలు లేవ్
ఇప్పటివరకు ఫాంహౌస్‌లను నిర్మించుకునేందుకు ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో అడ్డగోలుగా నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సమగ్ర ఫాంహౌస్ పాలసీని తీసుకువచ్చి.. వాటిపై నియంత్రణ తీసుకురావడంతో పాటు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధిని సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి విధివిధానాలు, ఫీజులు, అభివృద్ధి ఛార్జీలపై సంబంధిత అధికారులు కసరత్తులు ప్రారంభించారు.
జోన్ పరిమితులు లేకుండా..
కన్వర్షన్, బయో కన్వర్షన్, కమర్షియల్, ఇండస్ట్రియల్ జోన్లలో కూడా ఫాంహౌస్‌లకు అనుమతులు ఇవ్వాలని రేవంత్ సర్కార్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేసి.. ఆ తర్వాత వీటికి సంబంధించి విధివిధానాలను ఫైనల్ చేయనున్నారు. ఈ ఫాంహౌస్ పాలసీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణం, అభివృద్ధి ఫీజుల రూపంలో ఆదాయం పెరగనుందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత ఫాంహౌస్‌లకు వెళ్లడంపై మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కుటుంబాలు బాగా ఆసక్తి చూపిస్తున్నాయి. వీకెండ్ సేద తీరేందుకు ఫాంహౌస్‌లను వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే ప్రస్తుతం 100, 200 గజాల్లో కూడా ఫాంహౌస్‌లు నిర్మిస్తున్నారు. ఇలా చిన్న చిన్న స్థలాల్లో ఫాంహౌస్ నిర్మించి.. ఆ భూములను గుంటల లెక్కన రిజిస్ట్రేషన్లు చేస్తూ అక్రమాలకు తెరతీస్తున్నారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా అనుమతుల వ్యవస్థ స్పష్టంగా లేకపోవడంతో బిల్డర్లు ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు చేపడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నగరం చుట్టూ..
హైదరాబాద్ నగరం బయట మొయినాబాద్, చేవెళ్ల, శంషాబాద్, శంకర్‌పల్లి, కందుకూరు, ఘట్‌కేసర్, మేడ్చల్ ప్రాంతాల్లో భారీగా ఫాంహౌస్ లేఅవుట్లు పుట్టుకొస్తున్నాయి. చట్టపరంగా మాత్రం ఆ భూములు ఇప్పటికీ వ్యవసాయ భూములుగానే పరిగణించడం గమనార్హం.
కొత్తగా నిబంధనలు
కొత్తగా తీసుకొచ్చే పాలసీ ప్రకారం తక్కువలో తక్కువగా ఫాంహౌస్ నిర్మించాలంటే 1,200 చదరపు గజాల స్థలం ఉండాలి. ఆ ఫాంహౌస్‌కు కనీసం 30 అడుగుల వెడల్పైన రోడ్డు తప్పనిసరిగా ఉండాలి. మొత్తం స్థలంలో కేవలం 20 శాతం మాత్రమే కాంక్రీట్ నిర్మాణానికి అనుమతి ఉంటుంది. 1,200 చదరపు గజాల స్థంలో 240 గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ బిల్డింగ్ నిర్మించవచ్చు. మిగిలిన భూమిని పండ్ల తోటలు, కూరగాయల సాగుకు ఉపయోగించాలి. భవనం ఎత్తు 6 మీటర్లకు మించకూడదు. ఫాంహౌస్‌లు నిర్మించడం చట్టబద్ధం చేయడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడమే ఈ కొత్త పాలసీ లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది.