కాంగ్రెస్ ను కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్రలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో రోహిత్ వేముల చట్టం తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. దేశానికి స్వాతంత్రం సాధించడంతో పాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం సాధించేందుకు అనేక విప్లవాత్మక చట్టాలు చేసిన కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని తెలిపారు. స్వాతంత్రం ముందు నుంచి దేశంలోని రుగ్మతల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేసేందుకు బీజేపీ.. కాంగ్రెస్ ముక్తభారత్ చేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తాం అంటుందన్నారు. ఈ సమాజం సామాజికంగా, ఆర్థికంగా విభజన జరిగి ఇలాగే ఉండాలని కొన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని తెలిపారు. కులం అనేది భారతదేశంలో ఒక వాస్తవం, తాను కుల వివక్షణ ఎదుర్కొన్నానని వివరించారు. ఈ సమాజంలో కుల వివక్ష ఉంటుంది అన్న వాస్తవాన్ని మదిలో పెట్టుకుని బలమైన సంకల్పంతో అనుకున్న లక్ష్య సాధనకు ముందుకు పోతున్న క్రమంలో వివక్ష ఎదురైన అది మన లక్ష్యాలను దెబ్బతీయలేదని వివరించారు. వికారాబాద్ లో జరుగుతోన్న ఏపీ, తెలంగాణ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో సోమవారం ఆయన మాట్లాడారు. కుల సమస్యలు, రిజర్వేషన్లు, కాంగ్రెస్ వాదిగా కుల వివక్ష నిర్మూలనకు ఎలా పోరాటం చేయాలి అన్న అంశంపై భట్టి వారికి దిశానిర్దేశం చేశారు. దేశంలో అంటరానితనం, వివక్ష సమస్య ఎక్కడ ఎదురైనా రాహుల్ గాంధీ అక్కడ ప్రత్యక్షం అవుతారన్నారు. రు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల కుల వివక్షను భరించలేక బలవన్మరణానికి పాల్పడితే రాహుల్ గాంధీ నేరుగా యూనివర్సిటీకి చేరుకొని విద్యార్థులతో చర్చించి పోరాట విధానాన్ని ఖరారు చేశారని తెలిపారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను ఎవరిని కూడా యూనివర్సిటీలోకి రానివ్వలేదన్నారు. అంటరానితనం సమస్యను సమస్యగా చూడాలి తప్ప రాజకీయ జోక్యం ఉండకూడదు అన్నది రాహుల్ ఆలోచన అన్నారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం రాగానే వనరులు సంపద సమానంగా పంచుతామని ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ప్రకటించారు ఆయన ప్రకటించినట్టుగా అధికారంలోకి రాగానే ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశ స్వాతంత్రం అనంతరం ఎక్కడా జరగని కులగణనను ప్రజా ప్రభుత్వం 50 రోజుల్లో పూర్తి చేసి శాసనసభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను పూర్తిగా అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారానే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయ కరణ ద్వారా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక స్వాతంత్రం లభించిందని తద్వారా సామాజిక వివక్షను ఎదుర్కొనేందుకు చేయూత లభించిందని డిప్యూటీ సీఎం వివరించారు. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు అంకిత భావం, చిత్తశుద్దితో పని చేయాలని ఏపీ, తెలంగాణ డీసీసీలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డాక్టర్ వంశీ చందర్ రెడ్డి, ఏ ఐ సి సి నాయకులు విశ్వనాథన్, సావంత్, సచిన్ రావు తదితరులు పాల్గొన్నారు.