Take a fresh look at your lifestyle.

సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరాలి -వికారాబాద్ అభివృద్ధికి కృషి -సీఎం సహకారంతో అధిక నిధులు తెస్తా. -స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

  ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించడమే లక్ష్యమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట్ మండలం బూర్గుపల్లి గ్రామంలో జరిగిన గ్రామ సభలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఆర్ డి ఓ వాసుచంద్ర, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, జిల్లా వ్యవసాయ అధికారి రాజారత్నం ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులులతో కలిసి కార్యక్రంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు గ్రామాల లోని ప్రజలకు అందాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో గ్రామ సభలను ఏర్పాటు చేస్తుందన్నారు. మన ప్రభుత్వం వచ్చాక ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను మీకు వివరించడంతో పాటుగా మీ అవసరాలను తెలుసుకుని పరిష్కరిస్తున్నామన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మీ పథకంలో మా అక్కా చెల్లెల్లకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం, ఇప్పటి వరకు మహిళలు పదివేల కోట్ల రూపాయల ప్రయాణాలు చేశారు. 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలెండర్, గృహజ్వోతి పథకంలో పేదల ఇళ్ళకు ఉచిత కరంటు, రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి పది లక్షలకు పెంపు కల్పించామన్నారు. ఇక ఈ ఏడాది నుండి రాష్ట్రంలోని కుటుంబాలన్నింటికి భరోసా ఉండాలనే ఉద్యేశంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నారు. బడికి వెళ్ళే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి, ఆకలితో ఉండొద్దనే ఉద్యేశంతో ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉదయం పూట అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తున్నానని, అదేవిదంగా ఇంటర్ మీడియట్ విద్యార్ధులకు కూడా మద్యాహ్న భోజన సౌకర్యాన్ని అందిస్తున్నామన్నారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏమి పనులు చేసింది అనేది ప్రజలకు తెలుసు. ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది. ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, మేం అధికారంలోకి వచ్చి చూస్తే ఖజానాలో రూపాయి లేదు. కేసీఆర్ చేసిన అప్పులతో రాష్ట్రం వెనుకబడింది.
అధికారంలోకి వచ్చే వరకు గత ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసిన విషయం మాకు తెలియదు. ఇప్పుడు నెలకు 6,500 కోట్ల రూపాయలు అప్పు చెల్లిస్తున్నామన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్ధుడు కాబట్టి ఈ అప్పులను తీర్చుతూ మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తున్నాడు. రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగింది. పెద్దోల్లే కాదు పేదలు కూడా సన్న బియ్యం అన్నం తింటున్నారు. పదేళ్ల తర్వాత రేషన్ కార్డులు ఇస్తున్నాం, పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయి.
రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన విదంగా గ్రామంలో ఇళ్ళు లేని అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. స్వంత స్థలం లేకపోతే స్థలం ఇచ్చి ఇళ్ళు మంజూరు చేస్తాను. డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు. ప్రవేటు రంగంలో 15 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. గత ప్రభుత్వం చేసిన అప్పులు లేకపోతే మన ప్రభుత్వంలో తులం బంగారం వచ్చేది, మా అక్కా చెల్లెల్లకు నెలకు 2,500 రూపాయలు వచ్చేవి, పెన్షన్లు పెరిగేవి. వచ్చే ఎన్నికల నాటికి మహిళలకు ఇచ్చిన హామీ మేరకు 2500 రూపాయలు ఇయ్యకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని, త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు.
గత ప్రభుత్వం పదేళ్ళలో ఒక్క రోడ్డు వేయలేదు, నేను ఇప్పటికే 600 కోట్లతో రోడ్లు వేయించాను. ప్రతి గ్రామంలో 50 లక్షలతో సిసి రోడ్లు వేయించామన్నారు. స్పీకర్ హోదాలో ఉండడంతో మన వికారాబాద్ నియోజకవర్గానికి నిధులు ఎక్కువగా వస్తున్నాయి. మన నియోజకవర్గానికి 5000 ఇందిరమ్మ ఇళ్ళు వచ్చాయి, అందరికీ ఇస్తాను. ఈసారితో పాటుగా వచ్చే సారి కూడా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, మన ప్రాంతానికి నీళ్ళు రాకుండా గత ప్రభుత్వ పెద్దలు అడ్డం పడ్డారు. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలను ఆపారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ద్వారా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి మన ప్రాంతానికి సాగునీరు అందిస్తాంమ్మన్నారు.
ఎండాకాలంలో గ్రామాలలో నీటి ఎద్దడి సమస్యలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాను.
గ్రామంలో స్మశానవాటికకు వెళ్ళడానికి రోడ్డు అడిగారు, వెంటనే మంజూరు చేస్తున్నాను.
ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, మిగిలిన సమయంలో పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకుని గ్రామ అభివృద్ధికి పనిచేయాలని అందరికీ నా సూచన.
మన వికారాబాద్ నియోజకవర్గంలోని కోట్ పల్లి మండలం మోత్కుపల్లి గ్రామానికి ఉత్తమ గ్రామంగా జాతీయ అవార్డు వచ్చింది. యాబై లక్షల నగదు బహుమతి కూడా ఇచ్చారు. మోత్కుపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలన్నారు.
విలేజ్ ల్యాండ్ రీసర్వే ప్రారంభం
మోమిన్ పేట్ మండలం అమ్రాది కలాన్ గ్రామంలో విలేజ్ ల్యాండ్ రీసర్వేను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ప్రారంభించి గ్రామ సభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిజాం నవాబుల కాలంలో భూముల సర్వే జరిగింది. మళ్ళీ తొంబై ఏళ్ళ తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని ప్రజా ప్రభుత్వం ఆద్వర్యంలో భూముల రీ సర్వే ఇప్పుడు జరుగుతుంది. అప్పటికి ఇప్పటికి టెక్నాలజీ బాగా పెరిగింది. ఇప్పుడు ఆధునిక సాంకేతిక పద్దతులను ఉపయోగించి భూములను సర్వే చేస్తారు, సరిహద్దులు నిర్ణయిస్తారు. ప్రతి సర్వే నెంబర్ కు మ్యాప్ ఇస్తారు. ఇదంతా మీ ముందే, మీ అనుమతి తోనే జరుగుతుంది. ఈ సర్వే వలన మీకు మంచి జరుగుతుంది, భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ వివరాలను అన్నింటిని సమీకృత భూ భారతి పోర్టల్ లో నమోదు చేస్తారు. స్మార్ట్ ఫోన్ ద్వారా మీ భూమి వివరాలను, సరిహద్దులను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చన్నారు. ఈ సర్వేతో భూమి ఉన్న వారందరికీ మేలు జరుగుతుందని, భూమికి సంబంధించిన సమస్త సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, గ్రామాలలో భూమి పంచాయతీలు, గొడవలు ఉండవు,
ఎలాంటి లోటుపాట్లు లేకుండా, భూ యజమానుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అధికారులు సక్రమంగా సర్వే చేయాలన్నారు. సర్వేకు గ్రామస్తులు అందరూ సహకరించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.