ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లోని కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సరూర్ నగర్ అలకానంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కుంభకోణంపై నిజనిర్ధారణ కమిటీని వేసింది. ఉస్మానియా ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఒక నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ అలకానంద ఆసుపత్రిని పరిశీలించింది.
కిడ్నీ ఆపరేషన్లపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికను కమిటీ సమర్పించనుంది. అలకానంద ఆసుపత్రిలో అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయని సమాచారంలో పోలీసులు, వైద్యాధికారులు కలిసి దాడి చేసిన సంగతి తెలిసిందే. సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో ఆరు నెలల క్రితం ఆలకానంద ఆసుపత్రిని ప్రారంభించారు. కేవలం జ్వరం, ఇతర చిన్న చికిత్సలు చేయడానికి మాత్రమే ఆసుపత్రికి అనుమతి ఉంది. అయితే అనాధికారికంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నట్లు అధికారుల దాడుల్లో వెలుగులోకి వచ్చింది.