- 2036 ఒలింపిక్స్ లో తెలంగాణ బ్రాండ్ మెరిసేలా కొత్త స్పోర్ట్స్ పాలసీ.
- వచ్చే ఏడాదిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ.
- ఎస్ఎల్వీ ప్రో బ్యాడ్మింటన్ స్టేడియం” ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు.
ముద్ర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ను “గ్లోబల్ స్పోర్ట్స్ హబ్” గా మార్చాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 2036 ఒలింపిక్స్ లో తెలంగాణ బ్రాండ్ మెరవాలనే సంకల్పంతోనే కొత్త స్పోర్ట్స్ పాలసీకి శ్రీకారం చుట్టామన్నారు. మంగళవారం నిజాంపేట్ సమతానగర్ లో “ఎస్ఎల్వీ ప్రో బ్యాడ్మింటన్ స్టేడియం”ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. “ఒకప్పుడు క్రికెట్ ను మాత్రమే క్రీడగా భావించేవారన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. ఇతర క్రీడలకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. తల్లిదండ్రుల ఆలోచన తీరులోనూ మార్పు వచ్చిందన్నారు. “హైదరాబాద్ అంటే అందరికీ బిర్యానినే గుర్తుకొచ్చేది. ఇప్పుడు బిర్యానీతో పాటు బ్యాడ్మింటన్ కూడా గుర్తుకొస్తుందన్నారు. గోపీచంద్, సైనా నెహ్వాల్, పీవీ సింధూ, చిరాగ్, సాత్విక్ లాంటి ప్రముఖ క్రీడాకారులు ఇక్కడి నుంచే ప్రయాణాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు.వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది చిన్నారులు బ్యాడ్మింటన్ ను కెరీర్ గా ఎంచుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిస్తున్నారన్నారు. బ్యాడ్మింటన్ హబ్ గా హైదరాబాద్ మారడంలో గోపీచంద్ పాత్ర కీలకం” అని చెప్పారు.”కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. 2026లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని అన్ని గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. త్వరలో గచ్చిబౌలీలో బాలికల కోసం ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ అసోసియేషన్ అకాడమీని ప్రారంభించబోతున్నామన్నారు. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో స్పోర్ట్స్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని వివరించారు. ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీసి వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా బ్యాడ్మింటన్ కేవలం హైదరాబాద్ కే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లేందుకు చేస్తున్న కృషిని వివరించారు. ఆసక్తి గల క్రీడలో చిన్నారులు రాణించేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

