ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దే దిశగా ప్రజా ప్రతినిధులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. ఐదు రోజులపాటు మద్గుల్ చిట్టంపల్లి డిపిఆర్సి భవనంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శనివారం ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ సర్పంచ్ లను ఉద్దేశించి మాట్లాడుతూ… గ్రామ పంచాయతీల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అతి కీలకమైనదన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన విధంగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి చెందినట్లని అన్న విషయాన్ని మనం గుర్తించాలని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమ పథకాలు ప్రజలకు చేరవేసే బాధ్యత ప్రజాప్రతినిధులదేనని కలెక్టర్ అన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ గ్రామపంచాయతీల ఆర్థిక బలోపేతానికి కృషి చేయాలి అన్నారు. ఇంటి పన్నులు, వ్యాపార దుకాణాల పన్నులతో పాటు ఇతర ఆదాయ వనరులను సమకూర్చుకుంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సర్పంచులకు సూచించారు. గ్రామ పంచాయతీ ఆర్థిక వనరులను పెంపొందించుకున్నట్లయితే సీసీ రోడ్లు, పారిశుద్ధ్య పనులు, నీటి సమస్య లేకుండా చేయవచ్చునని కలెక్టర్ తెలిపారు. విబి జి రాంజీ (జాతీయ ఉపాధి హామీ) ద్వారా అంగన్వాడి, గ్రామపంచాయతీ లలో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు.
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎక్కడైనా నీటి సమస్య ఉంటే మోటార్లను మంజూరు చేసి నీటి సమస్య రాకుండా చూస్తామని అదేవిధంగా మిషన్ భగీరథ పనుల నిమిత్తం రవాణా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో సామాజిక కార్యక్రమాలపై ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. బాల్య వివాహాలు, సామాజిక రుగ్మతలు, రోడ్ల ప్రమాదాలు వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ప్రజా ప్రతినిధులు పాఠశాలలు, అంగన్వాడీల నిర్వహణను బాధ్యతగా తీసుకొని పాఠశాలల్లో డ్రాప్ అవుట్ ను తగ్గించే విధంగా చూడాలని, అంగన్వాడీలో సామ్ మామ్ పిల్లలను గుర్తించి పోషక ఆహారం అందే విధంగా తరచుగా పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టర్ సర్పంచులకు సూచించారు. ప్రజా పాలన ప్రగతి అమలు కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన తప్పనిసరిగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలలో భాగంగా రైతుబంధు, రైతు బీమా, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, రేషన్ కార్డుల పంపిణీ తదితర అంశాలను చర్చించి అందరి సహకారం తీసుకొని ప్రజా సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ సమావేశాలు నిర్వహించే క్రమంలో లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతులు తదితర అంశాలపై చర్చించి ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ ఉండాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సర్పంచులకు శిక్షణ ధృవీకరణ పత్రం అందించారు. శిక్షణ ముగింపు కార్యక్రమంలో జెడ్పి సీఈవో సుధీర్, డిపిఓ జయసుధ, శిక్షణ కార్యక్రమ మాస్టర్ ట్రైనీలు (ఎంపీడీవోలు) వినయ్ కుమార్, రాములు తదితరులు పాల్గొన్నారు.