Take a fresh look at your lifestyle.

చిన్నారులు, మహిళల భద్రతే విమెన అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ లక్ష్యం

డీసీపీ సృజన కరణం
ముద్ర, శేరిలింగంపల్లి: మహిళలు, చిన్నారుల భద్రత కోసం సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేది శనివారం నుండి 30వ తేది వరకు పలు రకాల ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టామని డీసీపీ సృజన కరణం తెలిపారు. ఆపరేషన్ స్మైల్ – 12లో భాగంగా సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 110 జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి 340 మంది బాలురను మరియు 12 మంది బాలికలను మొత్తం 352 మంది బాలలను విజయవంతంగా రక్షించగలిగామని చెప్పారు. సైబరాబాద్ షీ టీం బృందాలు ఈ వారంలో మొత్తం 138 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించగా, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర ప్రవర్తనకు పాల్పడిన 42 మందిని రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిలో 47 పిటీ కేసులు నమోదు కాగా, మిగిలిన వారికి కౌన్సెలింగ్ చేశారు. అదేవిధంగా, మహిళల నుండి అందిన 27 ఫిర్యాదులను షీ టీం బృందాలు స్వీకరించాయన్నారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన కుటుంబ సమస్యలను పరిష్కరించే దిశగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు, సీడిఈడబ్ల్యూ కేంద్రాలు కీలక పాత్ర పోషించాయన్నారు. ఈ కేంద్రాల ద్వారా 22 కుటుంబాలను తిరిగి కలిపి, వారి కుటుంబాల్లో వెలుగులను నింపామని డీసీపీ సృజన కరణం తెలిపారు.


సైబరాబాద్ పరిధిలో వివిధ ప్రాంతాలలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, షీ టీం బృందాలు మానవ అక్రమ రవాణా, బాలల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మహిళలను వేధించడం, సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులు, మహిళలను నిరంతరం వెంబడించడం, భిక్షాటన, సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులు, సైబర్ మోసాలు వంటి అంశాలపై అవగాహన కల్పించామన్నారు. మొత్తం 5,821 మంది ప్రజలకు అవగాహన కల్పించామన్నారు.


అలాగే మహిళల హెల్ప్ లైన్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, డయల్ 100, సైబర్ హెల్ప్ లైన్ కోసం 1930 వంటి సేవల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించామన్నారు.

Leave A Reply

Your email address will not be published.