- రంగారెడ్డి జిల్లాలో 19 పరీక్షా కేంద్రాలు, పరీక్షకు హాజరుకానున్న 6,964 మంది అభ్యర్థులు.
- అభ్యర్థులకు ఇబ్బందుల్లేకుండా అన్ని సౌకర్యాలు ఉండాలి.
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అడ్మిట్ కార్డు తప్ప మిగతావేవి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దు.
- టెలికాన్ఫరెన్స్లో అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాలు.
ఉమ్మడి రంగారెడ్డి, ముద్ర ప్రతినిధి: నీట్ పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి నీట్-2025 పరీక్షకు సంబంధించిన ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 4న (ఆదివారం) నిర్వహించే నీట్ పరీక్షకు రంగారెడ్డి జిల్లాలో 19 కేంద్రాలను గుర్తించడం జరిగిందని, 6 వేల 964 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు.నీట్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని తెలిపారు.పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు 144 సెక్షన్ విధించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్తు ఉండేలా చూడాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి అడ్మిట్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తప్పిస్తే ఎలాంటి వస్తువులు కూడా తీసుకురాకూడదని కలెక్టర్ సూచించారు. వేసవి కాలం అయినందున పరీక్ష కేంద్రాలలో త్రాగునీరు సౌకర్యాన్ని కల్పించాలని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ సిబ్బందిని నియమించి అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీట్ పరీక్షకు వచ్చే అభ్యర్థులకు సౌకర్యార్థంగా ఉండే విధంగా సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.