ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
రాష్ట్రంలోని నిర్మల్‌లో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సంతోష్ రాజుపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వాసవి యువసేన నాయకులు డిమాండ్ చేశారు.
ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వాసవి యువసేన అధ్యక్షుడు చెవ్వ ప్రమోద్, గౌరవ అధ్యక్షుడు డీవీ నారాయణ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఉన్న డాక్టర్‌పై దాడి చేయడం, దుర్భాషలాడడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
దుండగులు రాజకీయ ముసుగులో అరాచకాలు సృష్టిస్తూ, ప్రభుత్వం తమ చేతుల్లో ఉందని వ్యాఖ్యానించడం అనర్హమని మండిపడ్డారు. వైద్యుడిపై దాడి ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి బిల్లకంటి నందు, మలిపెద్ది చంద్రశేఖర్, భాను ప్రకాష్, కిషోర్, సంతోష్, శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు.