Take a fresh look at your lifestyle.

ఆ భూముల్లో పనులు ఆపేయండి

  • గచ్చిబౌలి భూములపై న్యాయస్థానాలు ఆగ్రహం.
  • చెట్లు నరికివేయడంపై సీరియస్​ అయిన సుప్రీం కోర్టు.
  • తదుపరి ఆదేశాల వరకు పనులు చేయవద్దని స్టే.
  • రిజిస్ట్రార్​ను నివేదిక అడిగిన అత్యున్నత న్యాయస్థానం.
  • మధ్యాహ్నం 3.30 గంటలకు నివేదించిన రిజిస్ట్రార్​.
  • హైకోర్టులోనూ సర్కారు షాక్​.
  • పనులు ఆపేయాలంటూ ఆదేశం.
  • కౌంటర్​ దాఖలు చేయాలన్న ధర్మాసనం.

ముద్ర, తెలంగాణ బ్యూరో : కంచ గచ్చిబౌలి భూముల వివాదాన్ని సుప్రీం కోర్టు, హైకోర్టు తప్పు పట్టాయి. చెట్లను నరికివేడయంపై ఉన్నత న్యాయస్థానాలు సీరియస్​గా పరిగణించాయి.ఈ విషయాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది.ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై జస్టిస్ గవాయ్ ధర్మాసనం సీరియస్ అయ్యింది. మూడ్రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.సుమోటాగా కేసు స్వీకరించిన ధర్మాసనం..ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొదంటూ స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.దీన్ని చాలా సీరియస్ అంశంగా పరిగణించింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని జస్టిస్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది.ఇది చాలా తీవ్రమైన అంశమని మండిపడింది.విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికను ఉన్నత న్యాయస్థానం పరిశీలించింది.అలాగే మీడియా, పత్రికల్లో వచ్చిన కథనాలను సైతం జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందు అమికస్ క్యూరీ పరమేశ్వర్ ఉంచగా..వాటినీ పరిశీలించింది.ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సుప్రీంకోర్టు ప్రతివాదిగా చేర్చింది. ఇంత అత్యవసరంగా భూముల్లో చెట్లు తొలగించి పనులు చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది.దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

  • ఏం చెప్తారో చెప్పండి.

తెలంగాణ ప్రభుత్వం గత నెల 15న నియమించిన కమిటీలోని అధికారులు సైతం సమాధానం చెప్పాలని హుకుం జారీ చేసింది.ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా చెట్లు కొట్టేసే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన నివేదికలోని ఫొటోలు చూసి అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పింది. వందల కొద్దీ యంత్రాలు మోహరించాల్సిన అగత్యం ఏంటో అర్థం కావడం లేదని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు.ఈ మేరకు ప్రభుత్వం చేపట్టిన పనులపై ఉన్నతన్యాయస్థానం అత్యవసరంగా స్టే విధించింది. ఇది చాలా సీరియస్ ఇష్యూ అని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు చురకలు అంటించింది. 400 వందల ఎకరాల భూవివాదంపై నెల రోజుల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించింది.ఆ కమిటీ ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని కోరింది. నెమళ్లు, జింకలు, పక్షులకు ఆవాసమైన అటవి ప్రాంతంలో చెట్లను ఎందుకు తొలగించారని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నిలదీసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో హైకోర్టు రిజిస్ట్రార్​ పంపిన నివేదికల్లో 100 ఎకరాల్లో అడవిని నాశనం చేశారని పంపించారు. దీంతో చెట్ల నరికివేతను సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టామని న్యాయమూర్తి తెలిపారు. ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణం జరిగినా..పూర్తి బాధ్యత సీఎస్‌దే అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.అంత అర్జెంట్‌గా డిఫారెస్టేషన్ పనులు మొదలుపెట్టాల్సిన అవసరమేంటని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. తమ ప్రశ్నలకు సీఎస్‌ సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించింది. అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం కోర్టు..తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.

  • హైకోర్టులోనూ వాదనలు.

సెంట్రల్‌ యూనివర్సిటీ వద్ద ఉన్న 400 ఎకరాల్లోని చెట్లను నరికి వేస్తున్నారని..అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్‌ దాఖలైంది. పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనాన్ని కోరారు.అయితే, పిటిషన్‌పై మధ్యాహ్నం 3.45కు విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. అప్పటి వరకు ప్రభుత్వం పనులు చేపడుతున్న స్థలాన్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టుకు తెలుపగా..హైకోర్టులో జరిగే విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని జస్టిస్‌ బీర్‌ గవాయ్‌ స్పష్టం తెలిపారు. తర్వాత ఉన్నత న్యాయస్థానంలోనూ స్టే వచ్చింది.

  • పనులు చేయకండి.. కౌంటర్​ దాఖలు చేయండి

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఇక్కడ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూముల అంశంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.హెచ్‌సీయూ భూములను రక్షించాలంటూ పలువురు పిటిషన్ వేయగా..పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు.అభిషేక్ సంఘ్వీ, నిరంజన్ రెడ్డి తమ తమ వాదనలను వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం..కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.తదుపరి విచారణను 7వ తేదీకి వాయిదా వేసింది. అలాగే 7వ తేదీ వరకు హెచ్‌సీయూ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు, పనులు చేపట్టవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది.ఈ మేరకు 7వ తేదీ వరకు స్టే విధించింది.విచారణ సమయంలో.. సుప్రీంకోర్టులోనూ ఈ అంశంపై విచారణ జరుగుతోందని హైకోర్టుకు పిటిషనర్ల తరపు న్యాయవాదులు తెలిపారు.దీనికి స్పందించిన న్యాయూర్తి.. హైకోర్టు ప్రొసీడింగ్స్‌పై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు కదా అని అన్నారు.మరోవైపు బుధవారం నాడు హైకోర్టు చెట్ల కొట్టివేతను ఆపాలని చెప్పినప్పటికీ గురువారం ఉదయం వరకు పనులు జరుగుతూనే ఉన్నాయని న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు.చెట్ల కొట్టివేత పనులు కొనసాగుతుండగా వీడియో తీసిన విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారని, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.అన్ని వివరాలు విన్న ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.అలాగే,సుప్రీంకోర్టు సైతం చెట్ల కొట్టివేతపై స్టే విధించిన నేపథ్యంలో ఏప్రిల్ 7వ తేదీ వరకు చెట్లను కొట్టివేయరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకే కేసులో ఇలా హైకోర్టు, సుప్రీంకోర్టులు ఒకే రోజు విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.

  • ఆరు నెలల వరకూ కంచగచ్చిబౌలి భూముల స్థితి యథాతథమేనా..?

ఈ క్రమంలో సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.ఆ కమిటీకి ఆరు నెలల సమయం ఇచ్చింది. అంటే మరో ఆరు నెలల వరకూ అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేదనే అనుకోవచ్చని న్యాయ నిపుణులు చెప్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.