Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ నాయకుల చార్జ్ షీట్ పై బహిరంగ చర్చకు మేం సిద్ధం

  • బీబీనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పెంటయ్య గౌడ్

బీబీనగర్, ముద్ర విలేకరి: బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన చార్జిషీట్ పై బహిరంగ చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా వుందని బీబీనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పంజాల పెంటయ్య గౌడ్ అన్నారు. కేవలం బీబీనగర్ పట్టణ అభివృద్ధికే 3.30 కోట్ల రూపాయలు విడుదల చేసిన ఘనత భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. బీబీనగర్ మండల కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మురుగునీరు చెరువులో కలవకుండా డ్రైనేజీ డైవర్షన్ కోసం కోటి రూపాయల నిధులను ఎమ్మెల్యే మంజూరు చేశారని, ఈ పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు చేసి మా పోరాటం వల్లే ఈ పని ప్రారంభమైందని చెప్పుకునేందుకు ఆరాటపడుతున్నారని ఆయన విమర్శించారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో సిగ్గు లేకుండా మాట్లాడుతున్న నాయకులు గత పదేళ్లపాటు అధికారంలో ఉండీ పట్టుమని 10 ఇండ్లను కట్ట లేకపోయారని అన్నారు. పోచంపల్లి రోడ్డు విషయంలో ఎమ్మెల్యే ఎప్పుడు కూడా హామీ ఇవ్వలేదని,  కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నిజంగా  డబల్ రోడ్డు కావాలని, ప్రజలకు అవసరమనుకుంటే ఎమ్మెల్యే కృషితో చేపించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. పోలీస్ క్వార్టర్స్ వద్ద ఉన్న స్థలాన్ని ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు అక్రమిస్తే, చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. దానిని కాపాడుకునేందుకు అఖిలపక్ష నాయకులంతా సిద్ధం కావాలని, త్వరలోనే దానికి కంచె వేద్దాం… మీరు కూడా సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ నాయకులకు పెంటయ్య గౌడ్ హితవు పలికారు. జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసింది మీ ప్రభుత్వమే కదా… ఆరోజు ఎందుకు మాట్లాడలేకపోయారని ప్రశ్నించారు. దీనిపైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. అలాగే  ఎయిమ్స్ ప్రారంభమైనప్పుడు అధికారంలో వున్నది మీ ప్రభుత్వమే కదా.. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించడంలో ఎందుకు విఫలమయ్యిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎంపీ ఎయిమ్స్ ను సందర్శించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా డబ్బులకు బయటి వారికి ఇస్తున్నారని ఎమ్మెల్యే& ఎంపీ దృష్టికి తీసుకురాగా అక్కడున్న అధికారిని తక్షణమే విధుల నుంచి తొలగించారని తెలిపారు. అనంతరం ఎంపీ మరోసారి ఎయిమ్స్ ను సందర్శించి ఇప్పటినుండి నూతనంగా విధుల్లోకి తీసుకుంటున్న వారి వివరాలను  ఇవ్వాల్సిందిగా కోరారన్నారు. ఎంఎస్ఎన్ రసాయన పరిశ్రమ నుంచి కాలుష్యం వస్తుంటే గత పది సంవత్సరాల అధికారంలో ఉండి ఏమి చేయకుండా సిగ్గులేకుండా..ఈ రోజు ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదనడం సిగ్గుచేటని తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రసాయన పరిశ్రమ వద్ద ధర్నా చేసి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందు ఉండి కాలుష్యం రాకుండా కంపెనీపై ఒత్తిడి చేసి కాలుష్యం లేకుండా చేయడంలో సఫలమయ్యారని ఆయన గుర్తు చేశారు. భీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజైనా ఈ రసాయన పరిశ్రమ గురించి మాట్లాడినారా అని ప్రశ్నించారు. వెంచర్ల విషయానికొస్తే గత పది సంవత్సరాల్లో పార్కు స్థలాలను అమ్ముకున్నారు. ఈరోజు 10 శాతం పార్కు స్థలాల కోసం మాట్లాడడం సిగ్గుచేటని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరైనా పార్క్ స్థలాలను ఆక్రమించి అమ్ముకున్నట్లు నిరూపిస్తే వాటిపైన చర్యలు తీసుకునేందుకు శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని  తెలిపారు. ఇందిరమ్మ కాలనీలో ఇంటి నెంబర్ల విషయంపై అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారని, నిజమైన లబ్ధిదారులకు ఇంటి నెంబర్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు.  గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి మీరెందుకు స్మశాన వాటికలను ఏర్పాటు చేయలేకపోయినారో చెప్పమని ప్రశ్నించారు. గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి అభివృద్ధి ఏమీ చేయలేని దద్దమ్మలు ఈరోజు ఏదో ఒక పని ఉండాలని ఉద్దేశంతో ఈ డ్రామా కు తెరలేపారని పెంటయ్య గౌడ్ విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలందరూ భారత రాష్ట్ర సమితి నాయకులు చేస్తున్న ఇలాంటి చిల్లర పనులను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మరోసారి ఎమ్మెల్యే పైన విమర్శలు చేసే సహించేది లేదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మీరు నిజమైన సమస్యలు ఏమైనా ఉంటే అధికార పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలి… కానీ ఇలాంటి డ్రామాలు బంద్ చేయాలని కోరారు.

 

Leave A Reply

Your email address will not be published.