Take a fresh look at your lifestyle.

నిమిషాంబిక సన్నిధిలో ఘనంగా సౌభాగ్యలక్ష్మి వ్రతాలు

బోడుప్పల్, ముద్ర విలేకరి: బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని పెంటారెడ్డి కాలనీలో వేంచేసి వున్న శ్రీ నిమిషాంబికా దేవి ఆలయంలో శ్రావణ చివరి ఆదివారం సందర్భంగా మహిళలతో ఘనంగా సామూహిక వ్రతాలు నిర్వహించారు. అమ్మవారికి లక్ష గాజులతో అలంకరించిన సందర్భంలో మహిళలతో సుమంగళి లక్ష్మి, సౌభాగ్య లక్ష్మి వ్రతాలను అర్చకులు చంద్రశేఖర శర్మ, ఉమాకాంత శర్మల ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే ఆలయానికి హాజరైన మహిళా భక్తులచే సుమంగళి లక్ష్మి, సౌభాగ్య లక్ష్మి లక్ష నామార్చన చేయించారు. ఈ వ్రతాలు, లక్ష నామార్చన సందర్భంగా నిమిషాంబికా ఆలయం శ్రీ మాత్రేనమ: మంత్ర ధ్వనితో మార్మోగింది. అమ్మవారిని, ఆలయాన్ని లక్ష గాజులతో అత్యంత శోభాయమానంగా అలంకరించి వుండడంతో విద్యుత్తు కాంతుల వెలుగులో గాజులు మెరుస్తూ ఆలయంలో అమ్మవారు నూతన శోభను సంతరించుకున్నారు.మందస్మిత వదనంతో అమ్మ దేదీప్యమానంగా వెలుగు దివ్వెల కాంతులతో ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ భక్తులకు కోర్కెలను తీర్చేందుకు అభయమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి జంటనగరాల భక్తులు, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ చేశారు. ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు కె.అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, కోశాధికారి ఎన్.రమేష్ , రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావులతో పాటు ఆలయ ట్రస్ట్ ధర్మకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.