ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ మరియు కంప్రెసెడ్ నేచురల్ గ్యాస్ (సి ఎన్ జి) ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో గద్వాలలోని పాత బస్టాండ్ సెంటర్లో ప్లకార్డులతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎ. వెంకటస్వామి మాట్లాడుతూ బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు ప్రజలపై ఎలాంటి భారాలు వేయబోమని, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచబోమని ప్రగల్బాలు పలికి ఎన్నికలు ముగియగానే పెట్రోల్ డీజిల్ పై మూడు రూపాయలకు పైగా సి ఎన్ జి పై రెండు రూపాయలకు పైగా ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపారని, “చెప్పేవి శ్రీరంగనీతులు దూరేది దొమ్మరిల్లు” అన్నట్టుగా బిజెపి నాయకుల వ్యవహారం ఉందని, ఎన్నాళ్ళని ప్రజలను మాయమాటలతో, మోసపూరిత విధానాలతో మధ్య పెడతారని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోమని ఏప్రిల్ 30వ తేదీన బహిరంగంగానే చెప్పారని, అబద్దాలు మాట్లాడుతున్న మీరు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వెళతారని ప్రశ్నించారు.
మళ్లీ ఈరోజు(17/5/2026) కూడా సి ఎన్ జి పై కిలోకి ఒక రూపాయి అదనంగా పెంచారని, రెండు రోజుల కాల వ్యవధిలోనే సీ ఎన్ జి ధరలు రెండుసార్లు పెంచడం ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనం అని అన్నారు.
ఈ ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చు పై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా నిత్యవసర వస్తువులు, వ్యవసాయ ఉత్పాదకాలు మరియు ప్రాథమిక సేవల ధరలు పెరుగుదలతో సహా ఆర్థిక వ్యవస్థ అంతటా ఇవి గొలుసుకట్టు ప్రభావాన్ని ప్రేరేపించడం ఖాయం అని అన్నారు.
జి ఎన్ జి ధరల పెంపు వల్ల ఆటో డ్రైవర్లు, రవాణా కార్మికులు మరియు తక్కువ ధరలతో ప్రజా రవాణా అందిస్తున్న కార్మికులపై మరియు ఆధారపడిన లక్షలాది మందిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ఇంధన ధరలను అన్నిటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి తో పాటు నాయకులు తిరుపతన్న, లక్ష్మన్న, ఆంజనేయులు, రంగన్న,నరేష్, కళ్యాణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.