- హైదరాబాదీ బిర్యానీ అద్భుతం – మిస్ ఇండియా నందిని గుప్త.
- నేటి నుంచి 31వ తేదీ వరకు పోటీలు.
- పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : మిస్ వరల్డ్ పోటీలు జరగడం తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.ఈ మేరకు బుధవారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ హోటల్ లో మిస్ వరల్డ్ పోటీలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిస్ వరల్డ్ సీఈవో జూలియా, మిస్ ఇండియా నందిని గుప్తా, పటేల్ రమేష్ రెడ్డి, టూరిజం శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌తో కలిసి మంత్రి జూపల్లి మాట్లాడారు.. మిస్ వరల్డ్ పోటీల కోసం వస్తున్న ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతిని పంచేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మిస్ వరల్డ్ గ్లోబల్ యూనిట్‌కి తెలంగాణ వేదిక అని, మన రాష్ట్ర సంప్రదాయం, పర్యాటక ప్రాముఖ్యతను పపంచానికి చాటేందుకు ఇదో చక్కటి అవకాశమన్నారు. ఈ పోటీలపై కొందరు రాజకీయంగా పనిగొట్టుకుని దుష్ర్పచారం చేస్తున్నారని ఆయన అన్నారు. మిస్ వరల్డ్ పోటీలను ఎవరు ఏ కోణంలో చూస్తే అలా కనిపిస్తాయని అన్నారు.ఈ పోటీల కోసం తెలంగాణ ప్రభుత్వం కేవలం రూ. 5 కోట్లను మాత్రమే ఖర్చు చేస్తుందని ఆయన చెప్పారు. పర్యాటక శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆహారం, సంస్కృతి, పర్యాటకాన్ని ప్రపంచానికి చాటేందుకు ఈ పోటీలు దోహదం చేస్తాయన్నారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇదో మంచి అవకాశమన్నారు.వీవీఐపీల కోసమే అందాల పోటీలు అనే అభిప్రాయం కాకుండా, సామాన్యులు సైతం హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు.ఈ పోటీలను తిలకించాలనే ఆసక్తి ఉన్నవారు పర్యాటక శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
- హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ ఛాయ్ అద్భుతం – మిస్ ఇండియా నందిని గుప్తా
హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ ఛాయ్ అద్భుతంగా ఉన్నయని మిస్ ఇండియా నందిని గుప్తా అన్నారు.తెలంగాణ గురించి మాట్లాడిన ప్రతిసారి తనకు గొప్ప అనుభూతి కలుగుతుందని, ఇక్కడి సంస్కృతి, అభివృద్ది ఎంతో గొప్పగా ఉందన్నారు. ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమను పంచుతున్నారని ఆమె చెప్పారు.
- నేటి నుంచి 31వ తేదీ వరకు పోటీలు
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు మే 7 నుంచి 31వ తేది వరకు జరగనున్నాయి.మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ నగరం మొదటి సారి ఆతిథ్యమిస్తోంది.10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గ్రాండ్ గా ఓపెనింగ్ సెర్మనీ జరుగుతుంది. 31న హైటెక్స్ లో ఫైనల్స్ నిర్వహిస్తారు. మిస్ వరల్డ్ పోటీలకు 120 దేశాల కంటెస్టెంట్స్ బరిలో దిగుతున్నారు.ఈ పోటీలకు తెలంగాణ టూరిజం శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. పోటీల కోసం ఇప్పటికే మిస్ వరల్డ్ సీఇఓ జూలియా మోర్లీ, మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్, మిస్ బ్రెజిల్ జెస్సికా, మిస్ కెనడా డయానా క్యాథరిన్, మిస్ థాయిలాండ్ ఓపల్ సుచాత, పోర్చుగల్ కంటెస్టెంట్ మారియా, ఘనా కంటెస్టెంట్ అమాపోకుహా, ఐర్లాండ్ కు చెందిన జాస్మిన్ జెరార్డ్, తదితరులు హైదరబాద్ చేరుకున్నారు.

