ముద్ర ప్రతినిధి, మెదక్:*
పరీక్షలు సమీపిస్తున్న నేపధ్యంలో సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు.
తల్లితండ్రులు తప్పనిసరిగా 10వ తరగతి విద్యార్థులను పాఠశాలకు హాజరయ్యే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ఇంటి వద్ద కూడా సాధన కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల ప్రగతిపై నిరంతర పర్యవేక్షణ అవసరం అన్నారు. శనివారం చిన్నశంకరంపేట్ మండలం సూరారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. ఏఏ సబ్జెక్టును ఏ విధంగా చదవాలో వివరించారు. పదవ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్, వివిధ భాష సామర్ధ్యాలను పరిశీలించి, పలు గణిత సమస్యలను పరిష్కరించారు. పరీక్షల సమయంలో సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలన్నారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో గరిష్ట ఉత్తీర్ణత సాధించడం, గుణాత్మక అభ్యాస ప్రమాణాలు పెంపొందించడం లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తున్న నేపధ్యంలో సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలన్నారు.
అందరూ ప్రత్యేక తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని, 100 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు.వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాలు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు.
జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు నాలుగు ప్రాజెక్టులు
జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు అత్యధికంగా మెదక్ జిల్లా నుండి నాలుగు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. జనవరి 7 నుండి 9 వరకు మూడు రోజులపాటు కామారెడ్డి విద్యానికేతన్ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా విద్యార్థులు ప్రతిభను చాటారు. సీనియర్ విభాగంలో పాల్గొన్న నాలుగు ప్రాజెక్టులను జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు రాష్ట్రం నుండి జాతీయస్థాయికి 21 ప్రాజెక్టులు ఎంపిక చేయగా అత్యధికంగా మెదక్ జిల్లా నుండి నాలుగు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఎంపికైన విద్యార్థులను గైడ్ టీచర్ లను కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ అభినందించారు..
ఎంపికైన ప్రాజెక్టులలో…బి.మహతి, గీతా హైస్కూల్ తూప్రాన్- వ్యర్థాల నిర్వహణ ప్లాస్టిక్ లకు ప్రత్యామ్నయం అనే అంశం.
అక్షయ్, సిద్ధార్థ రూరల్ హై స్కూల్ మాచవరం -ఎమర్జింగ్ టెక్నాలజీ అనే అంశం. ఎస్. గణేష్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చికోడ్ లింగాయపల్లి- నీటి సంరక్షణ, నిర్వహణ అంశం. ఆఫీఫా, సరస్వతీ కాన్వెంట్ హై స్కూల్ మెదక్ – వినోద భరిత గణితం. జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులు ఇదే స్పూర్తితో జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో రాణించి జిల్లాకు పేరు తేవాలని సూచించారు. సౌత్ ఇండియా సైన్స్ ఎగ్జిబిషన్ లో టీచర్ విభాగంలో ప్రథమ స్థానం పొందిన కొడపాక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వెంకట రమణను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఏఎస్ఒ నవీన్, గైడ్ టీచర్ లున్నారు.