ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల కబ్జాపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సంచలన ఆరోపణలు
బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి ఆ భూములు అమ్ముకున్నారని ప్రకటన
చర్చకు రావాలని షబ్బీర్ అలీకి కాటిపల్లి సవాల్
రోడ్లపైకి కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు
ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్ శ్రేణుల విఫలయత్నం
కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి కారు ధ్వంసం
పోలీసుల అదుపులో ఇరువర్గాల శ్రేణులు
తోపులాటలో పోలీసులకు గాయాలు
ఎమ్మెల్యే కాటపల్లి హౌస్ అరెస్ట్
ముద్ర, కామారెడ్డి :
కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అరోరా భూముల వివాదం ఉద్రికత్తకు దారితీసింది. ఈ వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మధ్య సవాలు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. శనివారం ఉదయం శిశుమందిర్ వద్దకు చర్చకు రావాలని షబ్బీర్ అలీకీ ఎమ్మెల్యే కాటిపల్లి సవాల్ విసిరారు. దీంతో కామారెడ్డిలో ఒక్కసారిగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి తన అనుచరులతో రాగా.. అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు మహేందర్ రెడ్డి కారును రోడ్డుపైనే తిరగేసి ధ్వంసం చేశారు. ఈ చర్యతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పి ఇరు పార్టీల నేతలు దాడులు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పోలీసులకు గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే కాటిపల్లి ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా.. ఆయన్ను హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రంలో భారీగా పోలీసులు మోహరించారు.
అసలేం జరిగింది?:
ఈ నెల 16న మీడియాతో మాట్లాడిన షబ్బీర్ అలీ.. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ భూములను ఓ ప్రైవేట్ పాఠశాల, కళాశాలకు అమ్ముకున్నది ఎవరు? రూ.6 కోట్లకు అరోరా కాలేజీకి అమ్ముకున్నది మీరు కాదా? అసలు కర్షపన్ కింగ్ వెంకటరమాణారెడ్డినేనని ఆరోపించారు. వెంకట రమణారెడ్డికి గతంలో తానే మున్సిపల్ కౌన్సిలర్‍గా అవకాశం ఇస్తే ఓడిపోయారనీ తర్వాత జడ్పీటీసీగా అవకాశం ఇస్తే గెలిచారన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్‍గా చేసినప్పుడు నాకు జన్మనిచ్చింది నా తండ్రి అయితే రాజకీయంగా నాకు జన్మనిచ్చింది షబ్బీరన్న అన్నది నువ్వు కాదా? అని ప్రశ్నించారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన చేతుల మీదుగా బీఫామ్ ఇస్తే చివరి నిమిషంలో టికెట్ అమ్ముకుని విత్ డ్రా చేసుకుని పారిపోయావ్ అని షబ్బీర్ అలీ ఆరోపించారు. మరుసటి రోజు ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి… షబ్బీర్ అలీపై మండిపడ్డారు. తనపై షబ్బీర్ అలీ చేసిన ఆరోపణలు ఈద్గ వద్ద కూర్చుందామా ఎక్కడైనా కూర్చుందాం రా చర్చకు అని సవాల్ చేశారు. తాను నా కుటుంబాన్ని తీసుకుని వస్తాను షబ్బీర్ కు దమ్ము ధైర్యం ఉంటే తన కుటుంబాన్ని తీసుకుని చర్చకు రావాలన్నారు. అన్యాయంగా ఎవరు మాట్లాడినా వాళ్ల వీపులు పగలగొట్టండి. ఇక్కడి నుంచి ఏ పోలీస్ స్టేషన్ కైనా నేనే నేరుగా వస్తా. ఇక చూసుకుందాం అంటూ తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఇక చూస్కో షబ్బీర్.. నువ్వు బీరో.. షబ్బీరో నీ సంగతి చూడకపోతే నా పేరు వెంకటరమణారెడ్డినే కాదు. నేను రెడ్డినో బుడ్డినే చూపిస్తానన్నారు. నా సంగతి నీకు అర్థం కావడం లేదు. నీ సంగతి చూడకపోతే నేను మీసాలు తీసేస్తానంటూ సవాల్ విసిరారు. కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములకు సంబంధించి తనపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై తేల్చుకునేందుకు రావాలంటూ ఎమ్మెల్యే కాటిపల్లి నిన్న ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు సాక్ష్యాలు తీసుకుని సరస్వతీ శిశుమందరి వద్దకు రావాలని ఇక్కడికి తాను స్వయంగా వస్తానని తెలిపారు. ఎమ్మెల్యే చేసిన సవాలుకు స్పందించిన కాంగ్రెస్ నేతలు తాము కూడా చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచే కామారెడ్డి పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.