- ఉత్తమ చిత్రం కల్కి.. ఉత్తమ నటుడు పుష్ప.
- గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రకటన.
- మొత్తం 11 కేటగిరీల్లో.. 21 మందికి అవార్డులు.
- ఎన్టీఆర్, పైడి జయరాజ్ సహా పలువురికి స్పెషల్ జ్యూరీ అవార్డ్.
- త్వరలో ఒకే వేదికపైకి సీఎం, అల్లు అర్జున్.
- సంధ్య థియోటర్ ఘటన తర్వాత తొలిసారి.
ముద్ర, సినిమా ప్రతినిధి : చాలా ఏండ్ల తర్వాత సినీ రంగానికి ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే సినీ రంగానికి ఇచ్చే నంది అవార్డులను ఆపేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ అవార్డుల విషయాన్నే పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాజాగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను గురువారం ఉదయం జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధతో పాటు ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, జ్యూరీ సభ్యులు ప్రకటించారు. 2024కు గాను ఉత్తమ చిత్రంగా కల్కి 2898 AD మూవీ ఎంపికైంది. రెండో బెస్ట్ మూవీగా పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ అవార్డును సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా ఉత్తమ దర్శకుడి అవార్డు కల్కి మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్‌ను వరించింది.
ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప-2), ఉత్తమ నటిగా నివేదా థామస్ (చిన్న కథ కాదు.. 35), ఉత్తమ నేపథ్య గాయనిగా శ్రేయా ఘోషల్ (ఫుష్ప-2), ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి (గామి) స్పెషల్ జ్యూరీ అవార్టులను దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్), అనన్య నాగళ్ల (పొట్టేల్), ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా-2), ఉత్తమ సహాయ నటుడిగా ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం), ఉత్తమ సహాయ నటి శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్), ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ (రాజూ యాదవ్) అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ స్క్రీన్ ప్లే వెంకీ అట్టూరి (లక్కి భాస్కర్), ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్ (రజాకార్), ఉత్తమ హస్య నటులుగా వెన్నెల కిషోర్, సత్య, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా గణేష్ ఆచార్య (దేవర), బెస్ట్ స్టోరీ రైటర్‌గా శివ పాలడుగు, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్- చంద్రశేఖర్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను అందుకోనున్నారు. అదేవిధంగా ఉత్తమ బాలల చిత్రంగా 35.. ఇది చిన్న కథ కాదు, ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ చిత్రంగా ‘రజాకార్’, ఉత్తమ పుస్తకంగా రెంటాల జయదేవ్ (మన సినిమా పుస్తకం) అవార్టులను కైవసం చేసుకున్నాయి.
- 11 కేటగిరీలు.. 21 అవార్డులు
కాగా, 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు అంటే మొత్తం 14 ఏళ్లకు గాను అవార్డులను వెల్లడించారు. ప్రతి ఏడాది ఒక్కో ఉత్తమ చిత్రానికి.. 2024కు సంబంధించి మొత్తం 11 కేటగిరీలలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈసారి మునుపెన్నడూ లేని విధంగా తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ (Urdu) చిత్రాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా 21 మందికి వ్యక్తిగతంగా అవార్డులు వరించాయి. వాటితో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డులను కూడా ప్రకటించారు. సినీ ఇండస్ట్రీకి అమూల్య సేవలందించిన ఎన్టీఆర్, పైడి జయరాజ్, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో స్పెషల్ అవార్డులను కూడా ప్రదానం చేయనున్నారు.అవార్టుల ప్రకటన సందర్భంగా జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ మాట్లాడుతూ.. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేకుండా పారదర్శకంగా అవార్డుల ఎంపిక జరిగిందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఈ అవార్డులు తమకు ఎంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. 14 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం సంతోషకరమని అన్నారు.
- అప్పుడు అరెస్ట్.. ఇప్పుడు అవార్డు.
తెలుగు చిత్ర పరిశ్రమను షేక్ చేసిన అంశాల్లో అల్లు అర్జున్ వివాదం ఒకటి. సంధ్య థియోటర్ విషాదం నుంచి ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్య దూరం పెరిగింది. అంతేకాదు.. ఇండస్ట్రీపై సీఎం ఆగ్రహంతో ఉన్నారంటూ రెండు వర్గాల్లోనూ చర్చ జరిగింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మీద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట, ఆ ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయాలు తెలిసినవే. దాంతో బన్నీ అరెస్ట్ జరిగింది. ‘పుష్ప 2’ ప్రెస్ మీట్‌లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు అరెస్ట్ జరిగిందని తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు చేశారు. బన్నీ అరెస్ట్, సంధ్య థియేటర్ ఘటన పట్ల అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. అదంతా గతం! వర్తమానానికి వస్తే. బన్నీకి అవార్డు ఇచ్చారు.నిజానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోక ముందు నుంచి ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులను ఇవ్వడం ఆపేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు ప్రభుత్వాలూ అవార్డులను నిర్లక్ష్యం చేశాయి.ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలుగు సినిమాకు అవార్డులను అనౌన్స్ చేసింది. ఆ అవార్డుల్లో ‘పుష్ప 2’ సినిమాలో నటనకు అల్లు అర్జున్ కు అవార్డు వచ్చింది. అయితే, ఇప్పుడు అవార్డు రావడం మళ్లీ చర్చకెక్కింది.గతంలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు బన్నీని అరెస్ట్ చేయించారని కేటీఆర్ సహా చాలా మంది విమర్శించారు. తనకు ఎవరి పట్ల వ్యతిరేకత గానీ, వివక్ష గానీ లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.బన్నీ జైలుకు వెళ్లడం పట్ల సంతాపం, సంఘీభావం వ్యక్తం చేసిన సెలబ్రిటీలు, అరెస్ట్ అయ్యాక ఆయన్ను పరామర్శించడానికి ఇంటికి వెళ్లిన సెలబ్రిటీలు ఒక్కరైనా చనిపోయిన మహిళను గానీ, ఆస్పత్రిలో ఉన్న ఆవిడ కుమారుడిని గానీ పరామర్శించారా? అని ప్రశ్నించారు.
- రేవంత్.. బన్నీ.. ఒకే స్టేజిపై!
గద్దర్ అవార్డుల రూపకల్పనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ప్రధాన పాత్ర. అవార్డులకు పేరు సూచించినది ఆయనే అట.ముఖ్యమంత్రి హోదాలో పురస్కార గ్రహీతలకు జ్ఞాపికలు సైతం ఆయన ఇవ్వనున్నారు.సాధారణంగా అవార్డులు సీఎం ఇస్తారు. ఉత్తమ నటుడికి అవార్డు ఆయనతో ఇప్పించే అవకాశం ఉంది. సంధ్య థియేటర్ ఘటన, బన్నీ అరెస్ట్, తదనంతర పరిణామాల తర్వాత రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఒకే వేదిక మీదకు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్ లో వస్తారని ఊహించవచ్చు. బన్నీతో పాటు ఆయన ఫ్యామిలీకి చెందిన ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ 2 ప్రొడ్యూస్ చేసిన ‘ఆయ్’కు మరో అవార్డు వచ్చింది.