ముద్ర ప్రతినిధి, నిర్మల్:
గత కొద్ది మాసాలుగా నిలిచిపోయిన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక భారీ బందోబస్తు మధ్య ఆదివారం పూర్తయింది. చైర్మన్ గా బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక, వైస్ చైర్మన్ గా బి ఆర్ ఎస్ కౌన్సిలర్ మొహమ్మద్ షోయబ్ ఎన్నికయ్యారు.

శనివారం జరగాల్సిన ఈ ఎన్నిక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆదివారానికి వాయిదా వేశారు. కాగా ఆదివారం జరిగే ఎన్నిక నిమిత్తం భద్రతా ఏర్పాట్లు ఎస్పీ జానకి షర్మిల స్వయంగా పర్యవేక్షించారు. కౌన్సిలర్లు చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం కౌన్సిలర్లు చేతులెత్తి తమ మద్దతు తెలియజేశారు. ముందుగానే చేసుకున్న ఒప్పందం ప్రకారం బీజేపీ, బి ఆర్ ఎస్ కౌన్సిలర్ల పరస్పర అంగీకారంతో చైర్మన్ బీజేపీ, వైస్ చైర్మన్ బి ఆర్ ఎస్ వశమైంది. ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఓటు వేశారు. ఎన్నిక అనంతరం చైర్ పర్సన్ గా అంకం మౌనిక, వైస్ చైర్మన్ గా మహమ్మద్ షోయబ్ హుస్సేన్ లు ప్రమాణ స్వీకారం చేసి ధ్రువీకరణ పత్రాలు స్వీకరించారు. పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ప్రత్యేక అధికారి జీవరత్నం, ఆర్డీవో రత్నకళ్యాణి, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, తహసిల్దార్ సుజాత, ఎంపీడీవో రమాకాంత్, ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా శివంగి మహిళా టీం
ఎస్పీ జానకి షర్మిల స్వయంగా పర్యవేక్షించిన భద్రతా ఏర్పాట్ల కారణంగా పరిసర ప్రాంతాలు పోలీసు పహారాలో ఉన్నాయి. పోలీసులు ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించి ప్రజల్లో నమ్మకం కల్పించారు. సున్నిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, పకడ్బందీ ప్రణాళికతో బందోబస్తు చర్యలు అమలు చేశారు. ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించిన శివంగి మహిళా టీం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రమశిక్షణ, ధైర్యం, విధుల్లో అప్రమత్తంగా పనిచేసి ముఖ్య ప్రదేశాల్లో పహారా కాస్తూ, శాంతిభద్రతలు భంగం కలగకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించింది. ఎస్పీ జానకి షర్మిల తో పాటు, అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఏఎస్పీ సాయి కిరణ్, ఖానాపూర్ ఇన్స్పెక్టర్ అజయ్, సోన్ ఇన్స్పెక్టర్ గోవర్ధన్ రెడ్డి, నిర్మల్ రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఆర్ఐ రామ్ నిరంజన్ రావు తదితరులున్నారు.