Take a fresh look at your lifestyle.

సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ కార్యక్రమాలు-ఎర్రవల్లి మండల స్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్.

 

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో ప్రజలకు అవగాహన.

హెచ్ పివి వ్యాక్సిన్ తో సర్వైకల్ క్యాన్సర్ నివారణ.

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు.

 

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:

సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టిందని, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాలతో ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఎర్రవల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 10 ముఖ్యాంశాలను అజెండాగా తీసుకొని 99 రోజులపాటు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడం జరిగిందని, గ్రామసభలు కూడా పూర్తి చేశామన్నారు. మండల స్థాయి సమావేశాల అనంతరం నియోజకవర్గ స్థాయిలోనూ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

హెచ్ పివి వ్యాక్సిన్ తో సర్వైకల్ క్యాన్సర్ ను నివారించవచ్చని 14 ఏళ్ల అమ్మాయిల అందరికీ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లు రాని వారికి తర్వాత విడతలో మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పోషణ్ పక్వాడలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల చిన్నారులు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నందున వినియోగించుకోవాలన్నారు. సర్పంచులు తమ పరిధిలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శిస్తుంటే అక్కడి పని తీరు మెరుగుపడుతుందన్నారు. రేషన్ కార్డులు లేని అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని, తొందరగానే ఇవ్వడం జరుగుతుందని నిరంతర ప్రక్రియగా పేర్కొన్నారు. రైతులు ఆయిల్ పామ్ పంటలు సాగు వేస్తే లాభసాటిగా ఉంటుందని, యూరియా వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. రైతు బీమా తో పాటు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం అర్రైవ్, అలైవ్ వారోత్సవాల్లో రహదారి భద్రతపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వాహనదారులు కూడా నిబంధనలను పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పలువురు గర్భిణీలకు సామూహిక సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, వైద్య, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వివిధ స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అంతకుముందు ఎర్రవల్లి మండల వివిధ శాఖల అధికారులు పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. లబ్ధిదారుల వివరాలను వెల్లడించారు. అలాగే వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజలు తమ ప్రాంత సమస్యలను గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో ఎర్రవల్లి మండల ప్రత్యేక అధికారి నుషిత, తహసిల్దార్ నరేష్, ఎంపీడీవో మహేష్, సర్పంచ్ అనిత, ఇతర ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.