- డిసిపి ఎగ్గడి భాస్కర్
రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : ఈ నెల 20 న బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ ఆలయం వద్ద నిర్వహించే ఆషాడ మాస బోనాల జాతరను భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్ తెలిపారు. శుక్రవారం జాతర ఏర్పాట్లను బెల్లంపల్లి ఏసిపి రవికుమార్,మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి,పట్టణ ఎస్సై రాజశేఖర్ పరిశీలించారు. అనంతరం మైసమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు జక్కుల సమ్మయ్య,గౌరవాధ్యక్షుడు పారిపెల్లి తిరుపతి తెలిపారు. మున్సిపల్,పోలీస్,ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో జాతరకు సహకరిస్తున్నట్లు వారు చెప్పారు. ఆదివారం ఉదయం 11 గంటలకు సమీపంలోని చెట్టు వద్ద నుంచి సుమారు 250 బోనాలతో అమ్మవారి ఆలయానికి చేరుకుంటామన్నారు. తెలంగాణ ప్రాంత సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల జాతరను ప్రతి ఏడు ఆషాడ మాసంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. భక్తులకు నిర్దేశించిన స్థలాలలో వాహనాలను పార్కింగ్ చేసుకుని పోలీసులకు సహకరించాలని సూచించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు డీసీపీ భాస్కర్ ను శాలువాతో సన్మానించారు.
