- మీర్ పేట హత్య కేసులో నిందితుడి చర్యలకు నివ్వెరపోయం
- రాచకొండ సీపీ సుధీర్ బాబు
ముద్ర, తెలంగాణ బ్యూరో : సంచలనం సృష్టించిన మీర్‌పేట వివాహిత వెంకట మాధవి హత్య కేసులో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు చూసి తాము నివ్వెరపోయామని, మనిషిని ఇంత క్రూరంగా పగ పెంచుకుని చంపుతారా ? అని షాకయ్యామని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. భార్యను అతి క్రూరంగా చంపిన నిందితుడు గురుమూర్తిలో కొంచెం కూడా పశ్చాతాపం కనిపించలేదన్నారు. ఈ మేరకు మంగళవారం నిందితుడు గురుమూర్తిని పోలీసులు మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఈ ఘోరమైన హత్య కేసులో ఆధారాలను సేకరించేందుకు తాము తీవ్రంగా శ్రమించాల్సివచ్చిందని అన్నారు. సంక్రాంతి పండుగకు నిందితుడు గురుమూర్తి తన భార్య వెంకట మాధవి, పిల్లల్ని తీసుకుని బంధువుల ఇంటికి వెళ్లాడు.
ఇక పిల్లల్ని బంధువుల ఇంటి వద్దే వదిలిపెట్టి, గురుమూర్తి, మాధవి కలిసి ఈనెల 15న రాత్రి 10.41 గంటలకు మీర్‌పేటలోని ఇంటికి చేరుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించామని సీపీ సుధీర్ బాబూ చెప్పారు. మరుసటి రోజైన 16వ తేదీన భార్యతో గురుమూర్తి గొడవ పెట్టుకున్నాడు. అనంతరం ఆమె తలను గోడకేసి కొట్టాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో గొంతు నులిమి చంపేశాడు. మాధవి శరీరాన్ని నాలుగు భాగాలుగా ముక్కలు చేశారు. మొదట కాళ్లను నరికేశాడు. అనంతరం చేతులను నరికాడు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు మృతదేహాన్ని మొత్తం ముక్కలు ముక్కలు చేసినట్లు గుర్తించామన్నారు. శరీర భాగాలను మొదట వాటర్ హీటర్‌తో మరిగించి.. ఉడకబెట్టాడు. ఆ తర్వాత స్టవ్‌పై ఆ ముక్కలను కాల్చాడు. రోకలి బండతో ఆ భాగాలను దంచి పొడి చేశాడు. ఆ పొడిని ప్లాస్టిక్ బకెట్లలో తీసుకెళ్లి జిల్లెలగూడ చెరువులో కలిపాడు. ఇక ఇంట్లో మాధవి ఆనవాళ్లు లేవని నిర్ధారించుకున్న తర్వాత బంధువుల ఇంటికి వెళ్లి తన పిల్లలను తీసుకొచ్చాడు అని సీపీ సుధీర్ వెల్లడించారు.