ముద్ర, కరీంనగర్ :
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ తీరుతో కరీంనగర్ అవినీతిమయమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సోమవారం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఎంఐఎంతో కాంగ్రెస్ రూ.వంద కోట్ల ఒప్పందం చేసుకుందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పలు కార్పొరేషన్‌లో బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకున్నాయని పొన్నం ఆరోపించారు. ఆ రెండు పార్టీల పరస్పర అవగాహనతోనే అభ్యర్థుల ఎంపిక కూడా జరిగిందన్నారు. పదేళ్లలో కరీంనగర్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్న మంత్రి వ్యాఖ్యానించారు.