కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరేస్తాం
ఈ ఎన్నికలు ధనవంతులకు, గుణవంతులకు మధ్య పోటీ
కేంద్రమంత్రి బండి సంజయ్
ముద్ర, కరీంనగర్ :
కరీంనగర్ కార్పోరేషన్ లో కబడ్డీ మొదలైందని కేంద్రమంత్రి బండి సంజయ్ వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడానికి భయపడ్డారని ఎద్దేవా చేశారు. కానీ తన రాజకీయ, రహస్య మిత్రుడు అసదొద్దీన్ ఒవైసీని పంపారని చెప్పారు. కరీంనగర్‌లో జరుగుతోన్న ఈ ఎన్నికలు ఇండియా-పాక్ మ్యాచ్‌లా ఉంటాయన్నారు. కరీంనగర్ మేయర్ పీఠం కచ్చితంగా బీజేపీదేనని స్పష్టం చేశారు. సోమవారం కరీంనగర్ పట్టణంలో ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. కరీంనగర్ లో జరుగుతోన్న ఎన్నికలు ధనవంతులకు, గుణవంతులకు మధ్య పోటీ అని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని చెప్పారు. తెలంగాణలోనే అత్యధికంగా ఇక్కడ ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో సంచులకు సంచుల డబ్బులను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్లు ఓటుకు రూ.10 వేలు ఇస్తానని చెబుతున్నట్లుగా తెలిసిందన్నారు. వాళ్లకు ఓట్లేస్తే రాబోయే ఐదేళ్ల ఆ పైసలే మళ్లీ తిరిగి సంపాదించుకుంటారని ఆరోపించారు. అదే బీజేపీ అభ్యర్థులకు ఓట్లేస్తే.. వారిని కార్పొరేషన్ అభివృద్ధి, సమస్యలపై బాజాప్తా ప్రశ్నించే హక్కు ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. కరీంనగర్ అభివృద్ధికి సహకరించి ఓటు వేయాలని స్థానికులకు పిలుపునిచ్చారు. తన దగ్గర డబ్బులు లేవని రేవంత్ రెడ్డి అంటున్నాడని.. మళ్లీ కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తే పన్నులు పెంచి ప్రజలపై తీరని భారం మోపుతుందని బండి సంజయ్ ఆరోపించారు.