ముద్ర ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….పాలమూరు విద్యార్థులు, ఇక్కడి ప్రజలు లేబర్ కాదని వీరంతా కోహినూర్ వజ్రాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లోని వైటిసి భవనం లో 45 రోజుల పాటు ఐఐఐటీ లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న 150 మంది విద్యార్థులకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పాలమూరు అంటే కేవలం శ్రామిక జిల్లా కాదని, ఎన్నో అన్యాయాలు, దగా, మోసాలకు గురైన జిల్లా అని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి పాలమూరు చరిత్ర ప్రధాన ఆధారమని, తెలంగాణ ఉద్యమంలో పాలమూరుకు జరిగిన అన్యాయం గురించి చెప్పి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు జిల్లాకు పూర్తి న్యాయం జరగలేదన్నారు. అందుకే యువత తెలంగాణ చరిత్రను కొత్తగా రాసి , భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ధారించే శక్తి యువతలోనే ఉందన్నారు. అందుకే విద్యార్థులు తమ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. ఎంత ఎత్తుకు ఎదగాలనుకుంటే అంత ఎత్తుకు ఎదగడానికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశాలు చాలా ఉన్నాయని, అందుకు అవసరమైన సహాయ సహకారాలు ఎల్లవేళలా అందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతం ఎన్నో కష్టాలు, కరువు కాటకాలు ఎదుర్కొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మనకు వనరులు లేవని కేవలం మన పూర్వీకులు ఇచ్చిన జ్ఞానమే మనకు ఉన్న ఏకైక ఆస్తి అని ఆయన అన్నారు. మన డిఎన్ఎలో ఉన్న మేధస్సు, తెలివి, కష్టపడే మనస్తత్వం, ప్రేమతో పలకరించే గుణాన్ని మనం ఆయుధాలుగా చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ శిబిరంలో పాల్గొన్న 150 మంది విద్యార్థులు తమ విజయాలతో తల్లిదండ్రులకు పేరుప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు. బాగా కష్టపడి చదవాలని, అది తమకోసం మాత్రమే కాకుండా కుటుంబ భవిష్యత్తు కోసం అవసరమన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి విద్య, సాగునీటి రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. గత రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం జరిగిందని, ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. ఈ విద్యా యజ్ఞంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు వచ్చే పది సంవత్సరాలు కష్టపడాలని పిలుపునిచ్చారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటి సాధన కోసం కష్టపడాలని విద్యార్థులకు సూచించారు. మహబూబ్‌నగర్ అభివృద్ధికి అవసరమైనన్ని నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని, ఇది జిల్లాకు లభించిన గొప్ప అవకాశమని, ఇదే మన పాలమూరుకు లభించిన స్వర్ణయుగమని ఆయన అన్నారు. పాలమూరు లేబర్ జిల్లా కాదని, సరస్వతి పుత్రుల అడ్డాగా నిలిపే బాధ్యత మనందరిదని పిలుపునిచ్చారు.జిల్లా ఎస్పీ జానకి మాట్లాడుతూ వ్యక్తి జీవితంలో విద్య వైద్యం రెండూ లభిస్తే జీవితం సాఫీగా ముందుకు సాగుతుందన్నారు. తల్లిదండ్రులు మీ పైన పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, అందుకే కసిగా చదువుకోవాలని, లక్ష్యం సాధించడం లో ఆడ, మగ అనే తేడా ఉండదని చెప్పారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివినప్పుడు అప్పట్లో ఇలాంటి ఎమ్మెల్యే లేరని, అయినా కాన్ఫిడెన్స్ తో చదివి, ఎస్పీగా ఎంపికైనట్లు ఆమె పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ ఫస్ట్ వందేమాతరం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ పొందిన విద్యార్థులు పదవతరగతి లో ఉత్తమ మార్కులు సాధించి, ఐఐఐటీలో సీటు సాధించి, ఎమ్మెల్యే గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు. మేయర్ గుమ్మాల మమత మాట్లాడుతూ..మహబూబ్‌నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయడంలో సఫలీకృతం అయిన ఎమ్మెల్యే పేదింటి బిడ్డల కలలను సాకారం చేయడానికి చాలా కృషి చేస్తున్నారని ఆమె చెప్పారు. డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఫాలోవర్స్ ను తయారు చేయడం లేదని, లీడర్లను తయారు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి ఎమ్మెల్యే తో కలిసి ప్రయాణం చేయడం జీవితంలో గొప్పని అనుభూతి కలుగుతున్నదన్నారు. వందేమాతరం ఫౌండేషన్ ఫౌండర్ రవీందర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఇలాంటి నాయకుడు దీపం పట్టి ఏ మూలన వెతికినా కనిపించడని, కోహినూర్ వజ్రం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు.. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్ గుముడాల రాధ , డిఇఓ ప్రవీణ్ కుమార్, ఐఐఐటీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రావణ్ కుమార్, ఎఎంఓ శ్రీనివాస్, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, వందేమాతరం ఫౌండేషన్ కో ఆర్డినేటర్ రవీందర్ రెడ్డి , సోంబూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.