ముద్ర ప్రతినిధి, రాజేంద్రనగర్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుళ్లకు మైనింగ్ లు అంటూ అవాస్తవాలతో ఆయనపై, కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నాలను చేయడం సరికాదని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. కోకాపేట్ నియో పోలీస్ ప్రాంతంలో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కొకా పేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవీన్ యాదవ్ మాట్లాడుతూ…
కొకా పేట్ నియోపోలిస్ ప్రాంతంలో అక్రమంగా కంకర క్రషర్లు నడుపుతున్నారంటూ ముఖ్యమంత్రి మేనల్లుడిపై బీఆర్‌ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఖండించారు.
తమ సంస్థ అన్ని ప్రభుత్వ అనుమతులతోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని స్పష్టం చేశారు. కొకపేట్ నియోపోలిస్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, కంకర క్రషర్లు నడుపుతున్నారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు.రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే బీఆర్‌ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తమపై చేసిన ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులను డిమాండ్ చేశారు.