నల్గొండ జిల్లాలో సుస్థిర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా అనుముల, కంగాల్ ముదిగొండ గ్రామాలను మోడల్ సోలార్ గ్రామాలుగా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే కొండారెడ్డిపల్లి గ్రామాన్ని మోడల్ సోలార్ గ్రామంగా రూపొందించడం జరిగింది. కొడంగల్ మరియు బోనకల్ మండలాల్లోని గ్రామాలను మోడల్ సోలార్ విలేజెస్గా అభివృద్ధి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నేడు నల్గొండ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో విద్యుత్ సరఫరా పనితీరును పరిశీలించిన ముషారఫ్ ఫరూఖి, చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL), అలాగే రెడ్కో వైస్ చైర్పర్సన్ & ఎమ్డీ వి అనిల స్థానిక అధికారులకు మోడల్ సోలార్ విలేజెస్ కార్యక్రమంపై మార్గదర్శకాలు అందించారు.
ఈ పథకం కింద మూడు గ్రామాల్లో సుమారు 15 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ. 97.39 కోట్లు వ్యయం చేయనున్నారు. దీని ద్వారా 1644 వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు
1251 ఇతర విద్యుత్ వినియోగదారులకు
సోలార్ ప్యానెల్స్ అమర్చనున్నారు.
సమీక్షా సమావేశం అనంతరం అనుముల గ్రామంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ శాసన సభ్యులు జైవీర్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాముఖ్యత మరియు అవసరంపై వినియోగదారులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమాల్లో గౌరవ శాసన సభ్యులు శ్రీ జైవీర్ రెడ్డి, TGSPDCL సిఎండి శ్రీ ముషారఫ్ ఫరూఖి, ఐఏఎస్, రెడ్కో VC&MD శ్రీమతి వి అనిల, డైరెక్టర్లు డాక్టర్ ఎన్ నరసింహులు, శ్రీ వి శివాజీ, చీఫ్ ఇంజనీర్ శ్రీ బాల స్వామి, ఎస్ ఈ శ్రీ వెంకటేశ్వర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.