- వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఏలేటి
ముద్ర ప్రతినిధి, నిర్మల్: బిజెపి తోనే దేశ అభివృద్ధి సాధ్యమని బీజేఎల్పి నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీతోనే దేశ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఎక్కడో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకురావడం మోదీ నాయకత్వం వల్లే సాధ్యమయిందని అన్నారు. ముచ్చట మూడో సారి అధికారంలోకి వచ్చి, ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తి గా ఎదిగేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పార్టీ పటిష్టతకు భరతమాతకు నిస్వార్థ సేవలు చేసి తమ జీవితాలను త్యాగం చేసిన పార్టీ వ్యవస్థాపక సభ్యులకు, కోట్లాదిమంది నిస్వార్థ కార్యకర్తలను గుర్తు చేసుకొని వారికి నివాళులు అర్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించడం కొరకు కృషిచేసిన ప్రతీ ఒక్కరిని గుర్తుచేసుకోవాలన్నారు. వికసితభారత్ 2047 లక్ష్యాన్ని సాధించడానికి మనమందరం సంకల్పాన్ని తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, సత్య నారాయణ గౌడ్, మెడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, తో పాటు కౌన్సిలర్లు, పట్టణ మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.